ఆసనం దక్కక.. ఆగ్రహజ్వాల | - | Sakshi
Sakshi News home page

ఆసనం దక్కక.. ఆగ్రహజ్వాల

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

శివాజీనగర: డీకే శివకుమార్‌ మంత్రివర్గ విస్తరణలో పదవులు లభించని హస్తం ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం అందుకున్నారు. అనేక మంది ఆశలు ఆవిరయ్యాయి, అలాంటి కొందరు ఎమ్మెల్యేలు బెంగళూరులో సమావేశం కాగా, కొందరు రాజీనామా చేస్తామని తిరుగుబాటు స్వరం పెంచారు. బెంగళూరులో కేపీసీసీ ఆఫీసు ధర్నాలకు వేదికగా మారింది.

బెంగళూరు నగర ఎమ్మెల్యే దినేష్‌ గుండురావుకు బెర్తు రాకపోవడంతో ఆగ్రహించారు. గాంధీనగర కార్యకర్తలు, వందలాది మంది అభిమానులు కేపీసీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్ల వద్ద తోపులాట జరిగింది. మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని కార్యకర్తలు కేకలు వేశారు. మంత్రి పదవి ఇవ్వడం లేదని ముందే చెప్పి ఉండాల్సిందన్నారు. అర్చకుల సంఘం కూడా మద్దతుగా పాల్గొంది. దినేశ్‌ గుండురావు విలేకరులతో మాట్లాడుతూ ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పి ఉండాల్సింది, ఇది తమ కార్యకర్తలను బాధించిందని అన్నారు.

ఏకధాటిగా ఆందోళనలు

● మరో ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప అభిమానులు కూడా కేపీసీసీ ముందు ధర్నా సాగించారు. కొందరు నల్లగుడ్డలు చుట్టుకుని వచ్చారు.

● నగర ఎమ్మెల్యే ప్రియా కృష్ణ మద్దతుదారులు కాంగ్రెస్‌ ఆఫీసు ముందు బైఠాయించి రభస చేశారు.

● ఆనేకల్‌, బాగేపల్లి సహా కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. నిరసనలు పెరుగుతాయా, చల్లబడతాయా? అనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టం కానుంది.

బెంగళూరు కేపీసీసీ ఆఫీసు ముందు వరుస ధర్నాలు

కొందరు ఎమ్మెల్యేల తీవ్ర వ్యాఖ్యలు

కేబినెట్‌ విస్తరణ రగిల్చిన చిచ్చు

అనాథల్లా ఉన్నాం

ఎమ్మెల్యే గోపాలకృష్ణ

దొడ్డబళ్లాపురం: కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది, మా కష్టాల గురించి అడిగేవారే లేరని, అమ్మా నాన్న లేని అనాథలుగా అనిపిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎంవై గోపాలకృష్ణ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రి పదవి దక్కకపోవడం ఆశ్చర్యంగా, అవమానంగా ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణ లో అనేక లోపాలున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారన్నారు.

తలలు పగలగొడితేనే...

గుబ్బి ఎమ్మెల్యే శ్రీనివాస్‌

తుమకూరు: విస్తరణలో మంత్రి పదవి లభించలేదని అసంతృప్తికి గురైన గుబ్బి ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ శ్రీనివాస్‌ కేఎస్‌ఆర్టీసీ బోర్డు అధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో విలేకరులతో మాట్లాడుతూ తనకు మంత్రి పదవి లభిస్తుందని ఆశించానని, రాకపోవడం విసుగు తెప్పించిందన్నారు. బుధవారం బెంగళూరుకు వెళ్లి కేఎస్‌ఆర్టీసీ బోర్డు అధ్యక్ష స్థానానికి రాజీనామా ఇస్తానన్నారు. రాజకీయాల్లో తమలాంటి సామాన్య రైతు కొడుకు పైకెదగడం కష్టమన్నారు. ఎవరైతే తలలు పగులగొట్టి డబ్బులు సంపాదిస్తున్నారో వారు రాజకీయాల్లో పైకి వస్తారని వ్యంగ్యమాడారు. నాకు గాడ్‌ఫాదర్‌ లేడు. అందుకే మంత్రి పదవి చేజారింది, రాజకీయాల్లో కొత్త పాఠం ఇప్పుడు అర్థమవుతోందన్నారు.

సిద్దుకు ఆప్తుడనని ఇవ్వలేదు: సుధాకర్‌

యశవంతపుర: తాజా మాజీ మంత్రి, చింతామణి ఎమ్మెల్యే డాక్టర్‌ ఎంసీ సుధాకర్‌ సీఎం శివకుమార్‌ను ప్రస్తావించకుండా ప్రభుత్వ ముఖ్యులు కారణమని ఎదురుదాడి చేశారు. వచ్చే రోజుల్లో గట్టి నిర్ణయం తీసుకోక తప్పదన్నారు. మంత్రి స్థానం తప్పడంపై స్పందిస్తూ, సిద్ధరామయ్య పనితీరును చూసి దగ్గరయ్యా, ఆ ద్వేషంతో నాకు మంత్రి పోస్టు ఇవ్వలేదని పరోక్షంగా సీఎంపై విమర్శలు చేశారు. గతంలో మంత్రులుగా ఉన్నవారికి మళ్లీ ఇచ్చారు, వారిలో ఏం చూసి ఇచ్చారో తనకు తెలియదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement