మైసూరు: ఆషాఢ మాసంలోని ఏడవ నక్షత్రం రోజున, మంగళవారంనాడు, శక్తి స్వరూపిణి చాముండేశ్వరి అమ్మవారి జన్మోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చాముండి గిరులపై తేరు ఉత్సవం జరగ్గా వేలాది భక్తజనం పాల్గొన్నారు. 1820లో, మైసూరు రాజు ముమ్మడి కృష్ణరాజ ఒడెయార్, ఆషాఢ మాసంలోని ఏడవ నక్షత్రం రోజున చాముండేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని బహూకరించారు. ప్రతి సంవత్సరం ఆ రోజును అమ్మవారి పుట్టిన రోజుగా ఆచరిస్తారు. చాముండేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని, మూలవిరాట్‌ను ఒకే విధంగా అలంకరించడం విశేషం.
తెల్లవారు నుంచి విశేష పూజలు
తెల్లవారుజామున 3 గంటలకు, చాముండికొండ ఆలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, మంగళారతి చేశారు. ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆలయం లోపల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవ విగ్రహాన్ని జరీ చీర, బంగారం, వజ్రాల ఆభరణాలతో సింగారించారు. ఎంపీ యదువీర్ ఒడెయార్ దంపతులు, రాజమాత ఆలయంలో ప్రార్థనలు చేసి జన్మోత్సవ ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారి రథాన్ని లాగి భక్తిని చాటుకున్నారు. రథంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రధాన పురోహితుడు శశిశేఖర్ దీక్షిత్ జన్మోత్సవం ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. రాజ కుటుంబానికి ఆది దేవత అయిన అమ్మవారిని దర్శించి దేశంలో మంచి వర్షాలు, పంటలు పండాలని ప్రార్థించామని యదువీర్ తెలిపారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలయాన్ని దర్శించుకున్నారు.
వైభవోపేతంగా అమ్మవారి జన్మోత్సవం
చాముండి కొండపై నేత్రపర్వంగా రథోత్సవం


