శివమొగ్గ: అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు మూడు ముక్కలుగా విరిగిపోయింది. సోమవారం రాత్రి సమీపంలో హైవేలో జరిగింది. శివమొగ్గలోని సీగేహట్టివాసి గురురాజ్ (21) అర్ధరాత్రి హోండా సిటీ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ ఎస్‌ఐ భారతి, సిబ్బంది విచారణ చేపట్టారు.
జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు
శివాజీనగర: డీ.కే.శివకుమార్ మంత్రివర్గ విస్తరణ తరువాత జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను ప్రకటించారు. కరువు, అతివృష్టి పరిస్థితిని అవలోకించి వాస్తవ నివేదికను ఇవ్వాలని వారిని ఆదేశించారు. తాలూకాలలో పర్యటించాలని తెలిపారు. చాలామంది మంత్రులకు వారి సొంత జిల్లాలనే ఇచ్చారు. కృష్ణభైరేగౌడ–బెంగళూరు నగర, సతీశ్ జార్కిహొళి–బెళగావి, ప్రియాంక ఖర్గే–కల్బుర్గి, యతీంద్ర సిద్దరామయ్య–మైసూరు, బీ.నాగేంద్ర–బళ్లారి, శివరాజ్ తంగడగి–కొప్పళ, రామలింగారెడ్డి– కోలారు, జీ.పరమేశ్వర్– తుమకూరు, అజయ్‌సింగ్– రాయచూరు జిల్లాలను అప్పగించారు.
మహిళల కోసం రుతు తార
బనశంకరి: మహిళల కోసం రుతు తార అనే కొత్త పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖమంత్రి యుటీ.ఖాదర్ తెలిపారు. నటి రమ్య ఈ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉంటారన్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మహిళలతో మాట్లాడి మెనోపాజ్ సమస్యల నుంచి విముక్తికి సలహాలు ఇస్తారన్నారు. మంగళవారం మంత్రి ఖాదర్, నటి రమ్యా ఓ సదస్సులో పాల్గొన్నారు. అందరి సలహాలు విన్న తరువాత రుతు తార నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నటి రమ్య మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మెనోపాజ్ తొందరగా కనబడుతుందన్నారు. నగరంలో ఎక్కువమంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు, ఉపశమన చర్యల గురించి చాలామందికి తెలియదని అన్నారు.
సీఎంపై పరిషత్ చైర్మన్ గుస్సా
దొడ్డబళ్లాపురం: విధాన పరిషత్ స్పీకర్ స్థానానికి రాజీనామా చేయాలని సీఎం డీకే శివకుమార్ ఫోన్ చేసి చెప్పారని, తమ హైకమాండ్ మాదిరిగా ఆదేశించారని పరిషత్ స్పీకర్ బసవరాజు హొరట్టి ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నేటి రాజకీయం చాలా భ్రష్టు పట్టిందని విమర్శలు గుప్పించారు. పరిషత్ అధ్యక్ష పదవి నుంచి హొరట్టిని సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పరిణామాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగలేదు, పార్టీ లెటర్ హెడ్‌లో స్పీకర్ల ఎన్నిక జరగలేదన్నారు. స్పీకర్ పదవి రాజ్యాంగం కల్పించిన పదవి అని హొరట్టి అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు ఒక్క తప్పు చేయలేదన్నారు. రాజీనామా ఎందుకు చేయిస్తున్నారో తెలియడం లేదన్నారు. అవసరమనుకుంటే తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సీఎం డీకే కు సవాల్ చేశారు.
ఏనుగు దెబ్బ.. కారు ధ్వంసం
దొడ్డబళ్లాపురం: ఓ అడవి ఏనుగు కారుపై దాడి చేయగా అందులో ప్రయాణిస్తున్న కుటుంబం ఎలాగో తప్పించుకుంది. కానీ కారును ఏనుగు ధ్వంసం చేసిన సంఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా దోలనమనె గ్రామం వద్ద సోమవారం రాత్రి జరిగింది. మహమ్మద్ జాహిద్ కుటుంబంతో కలిసి బెంగళూరులో ఒక శుభకార్యంలో పాల్గొని తిరిగి వెళ్తండగా, హఠాత్తుగా ఏనుగు అడ్డంగా వచ్చింది. తొండంతో బాదడంతో కారు వెనుక భాగం ధ్వంసమైంది. జాహిద్ కుటుంబం తీవ్ర భయభ్రాంతులకు లోనైంది. పిల్లలు, మహిళలు గట్టిగా ఏడవడం ప్రారంభించారు. జాహిద్ లైట్లు ఆన్, ఆఫ్ చేయడంతో ఏనుగు కాస్త దూరం వెళ్లింది. ఇంతలో కారుతో వెళ్లిపోయారు. మంగళవారం ఆయన అటవీ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు.
నాగేంద్ర ఢిల్లీ టూర్‌కి కోర్టు నో
బొమ్మనహళ్లి: మహర్షి వాల్మీకి కార్పొరేషన్ నిధుల స్కాం కేసులో నిందితునిగా ఉన్న నూతన మంత్రి బి.నాగేంద్ర ఢిల్లీ పర్యటనకు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు నో చెప్పింది. ఆగస్టు 10 వరకు ఢిల్లీ పర్యటనకు అనుమతి కోరుతూ బి.నాగేంద్ర పిటిషన్ దాఖలు చేశారు. అనుమతి ఇవ్వరాదని ఈడీ వ్యతిరేకించింది. విచారించిన కోర్టు, ఢిల్లీ పర్యటనకు దరఖాస్తుదారు సరైన కారణం చెప్పలేదని పేర్కొంటూ కొట్టివేసింది.


