చిక్కబళ్లాపురం: బైక్‌లకు పెద్ద శబ్ధం వచ్చే సైలెన్సర్లను బిగించుకుని నగర వీధుల్లో సంచరించే పోకిరీలను పోలీసులు పట్టుకుని సైలెన్సర్లను పెకలించారు. జిల్లా ఎస్పీ కుశాల్‌చౌక్సె ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. గత 3 నెలల నుంచి కర్కశ శబ్ద కాలుష్యం కలిగించే బైక్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని, వాటిని శనివారం రోడ్ రోలర్‌ను ఎక్కించి తుత్తునియలు చేశారు. ఇలాంటి సైలెన్సర్లను నిషేధించినట్లు, వీటిని ఎవరూ వాడరాదని ఎస్పీ తెలిపారు. ఎవరైనా అమర్చుకుని ఉంటే తక్షణం తీసివేయాలని కోరారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో 600 సైలెన్సర్లను నాశనం చేసినట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ విద్యాశ్రీ తెలిపారు. ఎక్కువ శబ్ధం రావడం వల్ల రోగులు, మహిళలు భయాందోళనకు గురవుతారన్నారు.
ఘరానా రౌడీ అరెస్టు
యశవంతపుర: నగరంలో కెంగేరి ఠాణా పరిధిలో రౌడీ విఘ్నేశ్‌ని గుండా చట్టం కింద అరెస్ట్ చేశారు. అతనిపై అనేక కేసులున్నాయి. అయినా పరివర్తన లేకుండా తరచూ నేరాలకు పాల్పడుతున్నాడంటూ పోలీసులు అతన్ని గుండా యాక్ట్ కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యాయత్నం, అత్యాచారం, దోపిడి, దాడుల నేరాల్లో కెంగేరిలోనే 11కుపైగా కేసులున్నాయి. ప్రజలను బెదిరించడంతో పాటు శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్నాడని తెలిసి నగర పోలీసు కమిషనర్ సీమంతకుమార్ సింగ్ ఆదేశాలతో అరెస్టు చేశారు.
ముసుగు దొంగల పట్టివేత
దొడ్డబళ్లాపురం: తాళం వేసిన ఇళ్లను దోచుకునే ముగ్గురు ముసుగు దొంగలను గదగ్ జిల్లా శహర పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కన్నడ జిల్లావాసి మహమ్మద్ రఫిక్ (36), బెళగావి జిల్లా నివాసి ఇమ్రాన్ (40), హావేరి జిల్లా నివాసి మౌలా అలీ దర్గా (34) పట్టుబడ్డారు. మే 8న గదగ్ సిటీలోని మంజునాథ్ అనే వ్యక్తి ఇంట్లోకి దూరిన దొంగలు రూ.34 లక్షల విలువైన బంగారు నగలు, రూ.2.2 లక్షల విలువైన వెండి వస్తువులు, రూ.8.50 లక్షల నగదు దోచుకున్నారు. ముసుగులు వేసుకుని, ఇంట్లో ఎటువంటి వేలిముద్రలు, సాక్ష్యాధారాలు లభించకుండా చాకచక్యంగా చోరీ చేశారు. శహర పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.42.73 లక్షల విలువైన సొత్తు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రఫిక్ పెద్ద గజదొంగ అని, అతనిపై రాష్ట్రంలో 68 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
3 నుంచి నానో సదస్సు
బనశంకరి: నానో టెక్నాలజీపై ఆగష్టు 3 నుంచి 5వ తేదీ వరకు బెంగళూరులోని లలిత్ హోటల్‌లో బృహత్ సదస్సును నిర్వహిస్తామని ఐటీ బీటీ శాఖమంత్రి ప్రియాంక్‌ఖర్గే తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ నానో, ఏఐ పరిజ్ఞానాలు నేడు వేగంగా విస్తరిస్తున్నాయి, ఈ సమావేశానికి దేశ విదేశాలనుంచి శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులు వస్తారని చెప్పారు. ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులపై చర్చలు జరుగుతాయన్నారు.


