బనశంకరి: బెంగళూరు జయనగర ఐదోబ్లాక్‌లోని నంజనగూడు శ్రీగురు రాఘవేంద్రస్వామి మఠంలో తొలి ఏకాదశి పూజలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వర్తించారు. మంత్రాలయ సుబుదేంద్ర తీర్థ స్వామి పూజల్లో పాల్గొన్నారు. బంగారు ఊయలలో శ్రీమన్ మూల రామదేవరకు మంగళహారతి చేపట్టి, సుదర్శన హోమం నిర్వహించారు. భక్తులకు ఉదయం 7:30 నుంచి తప్తముద్ర ధారణ చేశారు. స్వాముల ప్రవచనాలు, గాయకుల భక్తి గాన కచేరీ అలరించాయి.
ప్రసన్న వెంకటరమణస్వామికి..
కోలారు: తొలి ఏకాదశి సందర్భంగా శనివారం మాలూరు తాలూకాలోని చిక్క తిరుపతి గ్రామంలో ఉన్న పురాణ ప్రసిద్ధ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢ మాసంలో పవిత్ర తొలి ఏకాదశి కావడంతో ఏడుకొండలవాడు, అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. అర్చకులు శ్రీధర్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము 4 గంటల నుంచే పూజా వేడుకలకు నాంది పలికారు. దేవేరులతో కూడిన మూల విగ్రహానికి పంచామృత అభిషేకం, వేద మంత్ర పారాయణం, తదితర వివిధ పూజలు నెరవేర్చారు. పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు వచ్చారు.
ఆలయాలు, మఠాలలో విశేష పూజలు


