మైసూరు దసరాకు ముహూర్తం ఖరారు | - | Sakshi
Sakshi News home page

మైసూరు దసరాకు ముహూర్తం ఖరారు

Jul 11 2026 12:42 AM | Updated on Jul 11 2026 12:42 AM

బెంగళూరులో పర్యటించిన సీఎం

శివాజీనగర: ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా మహోత్సవం–2026 ఆచరణకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు ప్రారంభించింది. ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ నేతృత్వంలో శుక్రవారం విధానసౌధ సమ్మేళన సభా మందిరంలో ప్రాముఖ్యమైన దసరా సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దసరా మహోత్సవ తేదీని ఖరారు చేశారు. అక్టోబరు 11న ఉదయం 11.50 గంటలకు దసరా మహోత్సవాన్ని ప్రారంభించనుండగా, అక్టోబర్‌ 21న జంబూ సవారీని నిర్వహించనున్నారు.

దసరా ఉత్సవ వివరాలివే..

● జూలై 26న దసరా గజపడె ‘గజపయనం’ అధికారికంగా ప్రారంభమవుతుంది.

● ఆగస్టు 26న మైసూరు ప్యాలెస్‌ ప్రవేశ ద్వారం వద్ద దసరా గజపడెకు సాంప్రదాయ పూజలతో స్వాగతం

● అక్టోబర్‌ 11న ఉదయం 11.50 గంటలకు మైసూరులోని చాముండి హిల్స్‌ వద్ద ధనుర్‌ లగ్న శుభప్రదంలో నాడహబ్బ దసరా మహోత్సవానికి అధికారిక ప్రారంభం

● అక్టోబర్‌ 21న విజయదశమి సందర్భంగా వైభవోపేతంగా మైసూరు దసరా జంబూ సవారీ ఊరేగింపు

జంబూ సవారీ ముహూర్తం వివరాలు..

అక్టోబర్‌ 21వ తేదీన మధ్యాహ్నం 1.36 నుంచి 1.56 గంటల మధ్య శుభప్రదమైన మకర లగ్నంలో సీఎం డీకే శివకుమార్‌ నంది ధ్వజానికి పూజలు చేస్తారు. అదే రోజు సాయంత్రం 4.10 నుంచి 4.15 గంటల వరకు శుభప్రదమైన మీనరాశిలో బంగారు అంబారీలో కొలువై ఉన్న చాముండేశ్వరి అమ్మవారికి ముఖ్యమంత్రి, ప్రముఖులు పుష్పాంజలి ఘటిస్తారు. దసరా పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు సాంప్రదాయ తీర ప్రాంత క్రీడ కంబళను తొలిసారిగా నిర్వహించేందుకు ఒక సమావేశం జరిగింది. కంబళను అక్టోబర్‌ 18, 19 తేదీల్లో నిర్వహిస్తారు. ఇందుకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కంబళ కమిటీ విన్నవించింది. దసరా మహోత్సవ సమయంలో భద్రత, శుభ్రతను కాపాడటం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటం, దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక రంగానికి ప్రత్యేక ఉత్తేజం కల్పించే విషయంపై సమావేశంలో సుదీర్ఘంగా సమాలోచన చేశారు. అంతేకాకుండా ఈసారి దసరా మహోత్సవ ప్రారంభకులను నిర్ణయించే అధికారాన్ని సీఎంకు అప్పగించారు. సమావేశంలో మంత్రులు డాక్టర్‌ జీ.పరమేశ్వర్‌, కే.జే.జార్జ్‌, కే.వెంకటేశ్‌, మాజీ మంత్రి హెచ్‌.సీ.మహదేవప్ప, ఎమ్మెల్యే జీటీ దేవేగౌడతో పాటు మైసూరు ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు, మైసూరు, మండ్య, చామరాజనగర జిల్లాల జిల్లాధికారులు, ఎస్పీలు, సీఈఓలు పాల్గొన్నారు.

మైసూరు దసరా ఉత్సవాల్లో నిర్వహించిన జంబూ సవారీ(ఫైల్‌)

బెంగళూరులో శుక్రవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న సీఎం తదితరులు

అక్టోబరు 11న ప్రారంభోత్సవం

21న జంబూ సవారీ

బనశంకరి: ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా డీకే.శివకుమార్‌ శుక్రవారం బెంగళూరు నగర పర్యటన చేపట్టి వివిధ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు, ఫుట్‌పాత్‌ మార్గాల అభివృద్ధి పనులను పరిశీలించారు. బెళగావి నుంచి నేరుగా హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలోకి విచ్చేసిన సీఎం అక్కడ నుంచి నగర పర్యటన ప్రారంభించారు. ముందుగా హెచ్‌ఏఎల్‌ ముందు భాగంలో ఫుట్‌పాత్‌ పనులను పరిశీలించారు. అనంతరం అక్కడ నుంచి దొడ్డనెక్కుంది మెట్రోపిల్లర్‌ కింది భాగంలో రోడ్డు, ఫుట్‌పాత్‌లను పరిశీలించారు. అనంతరం ఔటర్‌రింగ్‌ రోడ్డు బెళ్లందూరు నుంచి ఇబ్బలూరు జంక్షన్‌ వరకు నిర్మించిన ఫుట్‌పాత్‌ మార్గాలను వీక్షించిన సీఎం ఇదే తరహాలో నగరంలోని ఇతర ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేసి సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వెంట నగరాభివృద్ధి శాఖ మంత్రి కృష్ణబైరేగౌడ, ప్రధాన కార్యదర్శి తుషార్‌ గిరినాథ్‌, జీబీఏ కమిషనర్‌ మహేశ్వర్‌రావ్‌తో పాటు బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం.సతీష్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement