సాక్షి, బళ్లారి: బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో నీటి ఎద్దడి రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. బళ్లారికి సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరబండ గ్రామంలో ఏళ్ల తరబడి తాగునీటి సమస్య ఉంది. నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తాగునీటి శుద్ధి కేంద్రం మూతపడి ఒకటిన్నర సంవత్సరం దాటింది. సమస్యను పరిష్కరించాల్సిన పాలకులు, అధికారులు గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదు. అప్పుడప్పుడు వచ్చే ట్యాంకర్ కోసం జనం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బిందెలు, డబ్బాలు, క్యాన్లు పట్టుకుని గంటల తరబడి నిలబడితే ఒకటో, రెండో మంచినీటి బిందెలు దొరుకుతాయి. ఇక సండూరు తాలూకా వేణివీరాపురం గ్రామస్తులు నీటి కోసం పోరాటాలు చేస్తున్నారు. అధికారులు, పాలకులకు నీటి సమస్యపై విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. చేసేది ఏమీ లేక డబ్బు ఇచ్చి నీరు కొనుగోలు చేస్తున్నారు.
ట్యాంకర్లే దిక్కు..
బళ్లారి నగరంలో 15 రోజులకు ఒకసారి మంచి నీరు విడుదల చేస్తున్నారు. నెలకు రెండుసార్లు మాత్రమే నీరు వదలడంతో జనం ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. తాగునీటి ప్లాంట్ల నిర్వాహకులు ధరలు అమాంతంగా పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో క్యాన్‌కు రూ.25 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఇంట్లో వాడుకునేందుకు రూ.1000 చెల్లించి ట్యాంకర్ ద్వారా నీరు తెప్పించుకుంటున్నారు. నీటి సమస్య తీవ్రత పెరుగుతున్నా ఆయా నియోజవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు నీటి సమస్య గురించి కనీనం ఆలోచించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఐదుగురు ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే అప్పుడప్పుడు నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు చుట్టుపు చూపు కాదు.. కనీసం రెండు నెలలు ఒకసారి కూడా నియోజవర్గాల వైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. నీటి సమస్య ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన చెందుతున్నారు.
నీరు సరఫరా బంద్..
రాయచూరు రూరల్: వారం రోజులుగా నగరంలో పలు ప్రాంతాల్లో పైప్‌లైన్ల మరమ్మతుల పేరుతో నీరు సరఫరా బంద్ చేశారు. నగర పరిధిలో మడ్డిపేట, బైరూన్ కిల్లా, గద్వాల రహదారి, జీడి తోట, తిమ్మాపూర పేట ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో జల జీవన్ పథకం కింద నిర్మించిన ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నీటి సమస్య
మూతపడిన తాగునీటి శుద్ధి కేంద్రాలు
పట్టించుకోని పాలకులు, అధికారులు


