యశవంతపుర: ఉడిపి మణిపాల్ వద్ద శుక్రవారం స్కూల్ బస్సు పల్టీ కొట్టింది. విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్న సమయంలో అతి వేగం కారణంగా అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. ఏడుమంది విద్యార్థులకు చిన్నపాటి గాయలయ్యాయి. ఒక విద్యార్థి తలకు గాయాలయ్యాయని, క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
విషపూరిత పుట్టగొడుగులు తిని 9 మందికి అస్వస్థత
దొడ్డబళ్లాపురం: విషపూరిత పుట్టగొడుగులు వండుకుని తిన్న ఒకే కుటుంబానికి చెందిన 9మంది అస్వస్థతకు గురైన సంఘటన బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉమరాణి గ్రామంలో చోటుచేసుకుంది. వర్షం కారణంగా పొలం వద్ద పుట్టగొడుగులు ఎక్కువగా మొలుస్తున్నాయి. ఈక్రమంలో గ్రామంలోని ఒక కుటుంబం వారు పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తూ వాటిని తీసుకువచ్చి వంట చేసుకొని తిన్నారు. కాసేపటికే అందరూ వాంతులు, విరేచనాలకు గురయ్యారు. గ్రామస్తులు వారిని చిక్కోడి ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో బెళగావి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా పుట్టగొడుగులు మొలిచిన చోట పక్కనే ఉన్న పొలానికి రైతు రసాయన మందులు చల్లడంతో పుట్టగొడుగులపై కూడా పడి విషాహారంగా మారినట్టు కొందరు పేర్కొంటున్నారు.
అమ్మో.. ఎంత పే..ద్ద పనసో.!
యశవంతపుర: కర్ణాటకలోని హాసన జిల్లా సకలేశపురలో జరుగుతున్న పనస, మామిడి మేళాలో 72 కేజీల పనసకాయ చూపరులను ఆకట్టుకుంది. సకలేశపుర తాలూకా హెబ్బనహళ్లికి చెందిన రైతు హెచ్‌బీ ప్రతాప్ కుమార్ తన తోటలో పండించిన మూడు అతి పెద్ద పనసకాయలను పట్టణంలోని శ్రీనివాస కన్వెన్షన్ హాల్‌లో జరిగిన మేళాలో ప్రదర్శించారు. మేళాలో పాల్గొన్న అనేక మంది రైతులను భారీ పనసకాయ ఆకర్షించింది. దీని బరువు ఎంత ఉండవచ్చనే ఆసక్తితో రైతులు పనసకాయను తూకం వేశారు. అది 72 కేజీల బరువు ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఇదివరకు 72 కేజీల బరువైన పనసకాయను ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదని తెలిపిన ఉద్యాన శాఖ అధికారులు సదరు రైతును అభినందించి సన్మానించారు.
బాలిక ప్రాణం తీసిన ఊయల
దొడ్డబళ్లాపురం: ఊయల బాలిక ప్రాణం తీసిన విషాద ఘటన బెళగావి జిల్లా నిప్పాణి తాలూకా కోడణి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శుబ్ర(14) అనే బాలిక శుక్రవారం ఆరోగ్యం బాగాలేక స్కూల్‌కి వెళ్లకుండా ఇంట్లలోనే ఉండిపోయింది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు.ఆ సమయంలో ఇంట్లో బాలికతో పాటు తాత ఒక్కడే ఉన్నాడు. చీరతో వేసిన ఊయలలో ఊగుతుండగా చీర బాలిక గొంతుకు చుట్టుకుని ఊపిరి ఆడక విలవిలలాడింది. గమనించిన తాత చుట్టుపక్కల వారిని పిలిచి బాలికను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.


