ఫుట్‌పాత్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌ పరిశీలన

Apr 12 2026 6:17 AM | Updated on Apr 12 2026 6:17 AM

సాక్షి, బళ్లారి: నగరంలో కనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద పాదచారులు వెళ్లేందుకు నిధులు వెచ్చించి ఫుట్‌పాత్‌ పొడవునా ఇనుప రాడ్డు, చైన్లు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా పని చేయడంతో ఇనుప రాడ్డు, చైన్లు అప్పుడే ఊడిపోయాయి. వాటికి మరమ్మతులు చేయించేందుకు అధికారులు చొరవ చూపకపోవడంతో శనివారం సాక్షి దినపత్రికలో ‘నాణ్యతకు తిలోదకాలు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. శనివారం సంబంధిత అధికారులు స్పందించారు. ఊడిపోయిన ఇనుప రాడ్లు, చైన్లకు మరమ్మతులు చేయించారు. పాదచారుల రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ధర్మ మార్గంలో నడవాలి

సాక్షి బళ్లారి: ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. ధర్మ మార్గంలో నడుస్తూ ధ్యానం, దైవ నామస్మరణ చేస్తూ జీవితాన్ని కొనసాగించాలని కొప్పళ గవిమఠం అవినవ గవి సిద్దేశ్వర స్వామి పేర్కొన్నారు. శనివారం తాలూకాలోని హంద్యాళ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అహంకారం, గర్వం నేను అనే భావన వీడి పరోపకారం కోసం పరితపించాలన్నారు. దేవుడిని మనసులో ఉంచుకుని పని చేయాలని సూచించారు. అహంకారం విడిచి పెడితేనే జీవితం సాఫీగా సాగుతుందన్నారు. కాలం మారిందని చెప్పే ముందు మనుషులు తమ మనస్సు, భావోద్వేగాలు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. జీవితంలో మనుషులకు బాధలు వస్తాయంటే ఉన్న పరిస్థితులను అంగీకరించే మనోభావం లేకపోవడమే ప్రధాన కారణమని వివరించారు. కార్యక్రమంలో శ్రీధరగడ్డ శాఖ విరక్తిమఠ కొట్టూరు స్వామి, స్థానిక ఎమ్మెల్యే గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ధర్మచింతనతో ప్రశాంతత

సాక్షి, బళ్లారి: ప్రేమ, సహనం, ఐక్యత, ధర్మచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని వక్తలు పేర్కొన్నారు. రాజస్తాన్‌లో మౌంటు అబూలో విశ్వ ఏకతా దినోత్సవం సందర్భంగా బళ్లారి నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పాల్గొని, ఆధ్యాత్మిక గురువుల నుంచి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో జీవిస్తున్నారన్నారు. బ్రహ్మకుమారి ఓం శాంతి సంస్థ సమాజంలో శాంతి నెలకొల్పేందుకు విశేష కృషి చేస్తోందని కొనియాడారు. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం తదితర మంచి అలవాట్లు నేర్చుకుని ఉత్తమ జీవితాన్ని కొనసాగించాలన్నారు.

అబార్షన్‌ చేయడం

చట్టరీత్యా నేరం

సాక్షి, బళ్లారి: చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరలో 16 సంవత్సరాల బాలికపై ఉపాధ్యాయుడు హెచ్‌.ఓ.రాజణ్ణ లైంగిక దాడి చేయడంతో గర్భం దాల్చింది. చెళ్లకెరెలోని లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్‌ హోమ్‌కు చెందిన డాక్టర్‌ శంకర లక్ష్మితో మాట్లాడి బాలికకు గర్భస్రావం చేయించిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్‌ చేసిన విషయం వెలుగులోకి రావడంతో శనివారం లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్‌ హోమ్‌ను వైద్యాధికారులు తనిఖీ చేశారు. అబార్షన్‌ చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా డబ్బుకు ఆశపడి బాలికకు అబార్షన్‌ చేసిన వైద్యురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రికి అధికారులు చర్యలు తీసుకుంటారో లేదా వేచి చూడాలి మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement