బళ్లారి రూరల్: కొంతకాలంగా బీఎంసీఆర్‌సీ (బళ్లారి మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్) క్యాన్సర్ విభాగంలో వైద్యుడు లేకపోవడంతో రోగులకు రేడియేషన్ థెరపీ వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో కల్యాణ కర్ణాటక వాసులు వ్యయప్రయాసలకు ఓర్చి కర్నూలు, హుబ్లీ, బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు నెలల క్రితం బీఎంసీఆర్‌సీ క్యాన్సర్ విభాగానికి రూ.9.53 కోట్ల విలువైన అధునాతన రేడియేషన్ యంత్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే యంత్రాన్ని రేడియేషన్ విభాగంలో అమర్చారు. అయితే అధునాతన రేడియేషన్ యంత్రం అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యుడు లేకపోవడం రోగులకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం కూడా రేడియేషన్ యంత్రం వినియోగానికి లైసెన్స్ ఇవ్వలేదు. బళ్లారి, విజయనగర, రాయచూరు, చిత్రదుర్గం, కొప్పళ, అనంతపురం ప్రాంతాలకు చెందిన క్యాన్సర్ రోగులు వైద్యం కోసం పడిగాపులు కాస్తున్నారు. త్వరితగతిన క్యాన్సర్ వైద్యుడిని నియమించి వైద్య సేవలు ప్రారంభించాలని వేడుకుంటున్నారు. ఈ విషయంపై బీఎంసీఆర్‌సీ డీన్, డైరెక్టర్ డాక్టర్ గంగాధర్ గౌడను సాక్షి సంప్రదించగా.. క్యాన్సర్ విభాగానికి త్వరలో వైద్యులు వస్తారని తెలిపారు. మరో రెండు నెలల్లో తిరిగి క్యాన్సర్‌కు వైద్య సేవలు ప్రారంభం అవుతాయన్నారు.
పెరుగుతున్న కొత్త కేసులు
ఆహార అలవాట్లు, దూమపానం, జీవనశైలి, ప్లాస్టిక్ వాడకం, కల్తీలు, తదితర కారణాలతో మన దేశంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు నానాటికీ పెరుగుతున్నారు. ఓ సర్వే ప్రకారం 2022 నుంచి 2025 వరకు 14.6 శాతం నుంచి 15.69 కొత్త కేసులు పెరిగినట్లు సమాచారం. క్యాన్సర్ వ్యాధికి గురై సగటున ఏడాదికి 5.5 లక్షల నుంచి 8 లక్షల మంది చనిపోతున్నట్లు వెల్లడైంది. క్యాన్సర్ రోగులను కాపాడటంతో రేడియేషన్ థెరపీ కీలకం. రేడియేషన్ థెరపీ లేదా రేడియోథెరపీ అనేది క్యాన్సర్ కణాలను చంపడానికి అధిక శక్తితో కూడిన ఎక్స్ కిరణాలను ఉపయోగించి చేసే చికిత్స. రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ సోకిన భాగాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా ఆ భాగానికి రేడియేషన్ ఇస్తుంది. ఇందువల్ల రోగులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బీఎంసీఆర్‌సీ క్యాన్సర్ విభాగంలో
రూ.9.53 కోట్ల వ్యయంతో
అధునాతన యంత్రం ఏర్పాటు
వైద్యుడు లేకపోవడంతో
రోగుల ఇబ్బందులు
పట్టించుకోని ఉన్నతాధికారులు


