రాయచూరు రూరల్: రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్పను మాజీ మంత్రి శివనగౌడ నాయక్ అవమానించడం తగదని కేపీసీసీ మాజీ కార్యదర్శి అమరేష్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల దావణగెరెలో ఎస్సీ, ఎస్టీ నాయకుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారన్నారు. అలాంటి నాయకులను పట్టుకొని చెంప పగల గొట్టాలని వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. మంత్రిని కొట్టే ధైర్యముంటే శివనగౌడ సిద్ధంగా ఉండాలన్నారు. మాజీ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
హొసపేటె: నగరంలోని కూడ్లిగి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) రేషన్ బియ్యాన్ని పోలీసులు గుర్తించి బుధవారం స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా కూడ్లిగి పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది బృందం ఈ దాడి నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా రవాణా చేస్తున్న మినీ లారీని పట్టుకుని తనిఖీ చేయగా, రేషన్ బియ్యం అని తేలింది. మొత్తం 360 బస్తాల్లో నింపిన 18,240 కిలోల బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం విలువ సుమారు రూ.4,10,400 ఉంటుందని అంచనా వేశారు. ఘటనపై కూడ్లిగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ సరికాదు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం సరికాదని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. బుధవారం జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. నూతన విద్యుత్ చట్టం–2025ను ఉప సంహరించుకోవాలన్నారు. ఉద్యోగుల, కార్మికులకు రక్షణ కల్పించాలన్నారు. విద్యుత్ వినియోగదారుల, రైతుల, చిన్న వ్యాపారుల సమస్యలను సరిదిద్దాలని కోరుతూ జెస్కాం ఇంజనీర్ దేశాయికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో జ్యోతి బసవ, హులిగప్ప, శివ కుమార్, రామణ్ణ, అణ్ణప్ప, వీరేష్ బాబు, వీరభద్రయ్య, మహేంద్ర సింగ్‌లున్నారు.
సామాజిక బాధ్యత
అందరి బాధ్యత
హొసపేటె: సామాజిక బాధ్యత అనేది పరిశోధన బాధ్యత మాత్రమే కాదు, సమాజంలోని ఏ రంగంలో నైనా, ఏ వృత్తిలోనైనా పాల్గొన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రముఖ విమర్శకుడు, హంపీ కవివి కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు డాక్టర్ బంజగెరె జయప్రకాష్ అన్నారు. బుధవారం హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలోని భువన విజయ ఆడిటోరియంలో విద్యా సంస్థ తరపున పరిశోధన, సామాజిక బాధ్యత అనే అంశంపై ఆయన మాట్లాడారు. పరిశోధన చేపట్టకూడదు. ఒక పరిశోధకుడికి తన రంగంలో నైపుణ్యం ఉండాలి. ఈ రోజుల్లో పరిశోధన ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏమిటంటే, ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఏ దృక్కోణం నుంచి, ఏ ఆసక్తితో అర్థం చేసుకోవాలి, ఏ అంశాన్ని అధ్యయనం చేసినా దానిని సరైన దృక్కోణం నుంచి ప్రదర్శించాలని ఆయన అన్నారు.
సెక్యూరిటీగార్డు ఇంటిలో చోరీ
శివమొగ్గ: సెక్యూరిటీ గార్డు ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన శివమొగ్గ తుంగా నగర పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీరాంపురలో జరిగింది. శ్రీరామపురలో నివాసం ఉంటున్న సెక్యూరిటీ గార్డు విధి నిర్వహణకు వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి వెనుక తలుపులు పగులగొట్టి లోపలకి చొరబడి రూ.4 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలు, బీరువాలోని రూ. 20 వేల నగదు దోచుకుని పారిపోయారు. సెక్యూరిటీ గార్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుంగా నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


