రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణలు, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశం కల్పించడం తగదని కర్ణాటక మాదిగ పోరాట ఐక్య వేదిక మహాసభ సంచాలకుడు విరుపాక్షి పేర్కొన్నారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియామకాలు జరిగితే మాదిగ విద్యార్థులకు మరణ శాసనంగా మారుతుందన్నారు. సర్కార్ ఈ విషయంలో ఆచి తూచి అడుగు వేయాలని కోరుతూ జిల్లాధికారి నితీష్‌కు వినతిపత్రం అందించారు. ఆందోళనలో రవీంద్ర, భీమన్న, ఆంజనేయ, కిరిలింగప్ప, నరసప్ప, మౌనేష్‌లున్నారు.
విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం
రాయచూరు రూరల్: నేటి సమాజంలో విద్యార్థుల్లో క్రమశిక్షణకు ఆద్యులు ఉపాధ్యాయులు అని రిమ్స్ రిటైర్డ్ నేత్ర చికిత్స అధికారి ప్రభనగౌడ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం దేవదుర్గలో జ్ఞానగంగ పాఠశాల వార్షికోత్సవంలో జ్యోతి వెలిగించి మాట్లాడారు. విద్యార్థుల్లో సంస్కృతి, సంస్కారం, ఆచార, విచారాలు, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించాలన్నారు. విద్యార్థులు తమ ప్రతిభతో కళలను పోషించాలన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల సంస్థాపకులు శరణబసవ, భీమనగౌడ, చంద్రశేఖర్, శంకరలింగయ్య, సుభాష్‌చంద్రలున్నారు.
మాదిగలకు రిజర్వేషన్
50 శాతం మాత్రమే
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు కల్పించే రిజర్వేషన్ 50 శాతం మాత్రమే అని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర, చలువాది మహాసభ సంచాలకుడు భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరుగుతాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 56 శాతం రిజర్వేషన్లు దాటితే ఉద్యోగాల్లో నియామకం చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం 50 శాతంతోనే ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. మాదిగ విద్యార్థులకు కుల ధ్రువీకరణ ప్రమాణ పత్రాలను అందించాలని ఒత్తిడి చేశారు.
వలకు చిక్కిన భారీ చేప
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని గండబొమ్మనహళ్లి చెరువులో ఒక మత్స్యకారుడు ఎప్పటిలానే వల వేశాడు. చిన్న చేపలు పడతాయని ఎప్పుడూ అనుకుంటూనే అతను నీటిలో నుంచి వలను పైకెత్తుతున్నాడు. ఆ సమయంలో వలలో చిక్కుకున్న ఒక పెద్ద చేపను చూసి అతను ఎంతో సంబర పడ్డాడు. చెరువులో నుంచి చేపలను ఒడ్డుకు తేవడం మత్స్యకారుడికి పెద్దగా ఇబ్బంది కలిగించింది. వావ్, ఎంత పెద్ద చేపో ! అని అతను ఆశ్చర్యపోయాడు. ఈ చేప ప్రస్తుతం 22 కిలోల బరువు ఉంది. కట్ల చేపగా గుర్తింపు పొందింది.
మంచి వర్షాల కారణంగానే..
ఈ సారి మంచి వర్షాల కారణంగా చెరువులో భారీగా నీరు చేరింది. అందువల్ల చెరువులో ఒకే పరిమాణంలో చేపలు ఉండటం మత్స్యకారులకు శుభవార్తగా ఉంది. 22 కిలో బరువున్న జెయింట్ క్యాట్‌ఫిష్ ఇప్పటి వరకు మత్స్యకారులు పట్టిన అతిపెద్ద చేపగా మారింది. గతంలో వలలో పడిన రౌ, అరటి, జిలేబీ చేపలు ఒక్కొక్కటి కనీసం 5 నుంచి 7 కిలోల బరువు ఉండేవి. కానీ ఈసారి పట్టుకున్న 22 కిలోల క్యాట్ ఫిష్ చేపల ప్రియులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వలలో పడిన ఈ పెద్ద చేప ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చేపను ఔత్సాహికులు రూ.3,300 ధరకు కొనుగోలు చేశారు.


