మిరప ధర ఘనం.. దిగుబడి పతనం | - | Sakshi
Sakshi News home page

మిరప ధర ఘనం.. దిగుబడి పతనం

Mar 12 2026 7:17 AM | Updated on Mar 12 2026 7:17 AM

రాయచూరు రూరల్‌: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదన్న సామెత చందంగా మార్కెట్‌లో మిరప ధరలు పెరిగినా పొలాల్లో దిగుబడి మాత్రం క్షీణించింది. దీనికి తోడు ఇరాన్‌– ఇజ్రాయెల్‌–అమెరియా దేశాల మధ్య యుద్ధంతో రైతన్న పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ముఖాల్లో కళ లేదు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని కొప్పళ, రాయచూరు, యాదగిరి, కలబుర్గి, బీదర్‌ జిల్లాల్లో తుంగభద్ర, కృష్ణా నదులున్నా నీరు అందక రైతుల పొలాల్లో వేసుకున్న మిరప పంట ఆశించిన మేర దిగుబడి రాలేదు. బోరుబావుల కింద పంటలు పండించాలంటే విద్యుత్‌ కోతలు అధికమయ్యాయి. రాయచూరు జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదులున్నా వ్యవసాయ పనులు లభించక కూలికార్మికులకు ఉపాధి కోసం దేశాటన తప్పడం లేదు. రైతులు రాయచూరు జిల్లాలో 50 వేల ఎకరాల్లో మిరప, 86 వేల ఎకరాల్లో కందులు సాగు చేశారు. కాలువకు నీరందక భూములు బీళ్లుగా మారాయి. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక మిరప పంట చేతికి అందదనే ఆందోళనతో అక్కడక్కడా నీటిని కడవలు, బిందెలతో మోసిపోశారు. బ్యాడగి రకం మిరపకాయలు క్వింటాల్‌ ధర రూ.14 వేలు, గుంటూరు రకం మిరప కాయలు క్వింటాల్‌ ధర రూ.12,675, ఇతర రకాలకు క్వింటాల్‌ ధర రూ.8 వేల చొప్పున మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. యుద్ధం కారణంగా ఇతర దేశాలకు మిరప కాయల ఎగుమతులు నిలిచిపోయి రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

మార్కెట్‌లో ఆశాజనకంగా మిర్చి ధరలు

రైతులకు శాపంగా పశ్చిమాసియా యుద్ధం

దిక్కుతోచని స్థితిలో కళ్యాణ కర్ణాటక రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement