వార్డులో సమస్యలు తీర్చండి
రాయచూరు రూరల్: నగరంలోని 26వ వార్డులో పేరుకున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎంఎం డిమాండ్ చేసింది. నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఫారూక్ షేక్ మాట్లాడారు. సామాన్యులు సంచరించే ప్రదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన మురుగు కాలువల నుంచి దుర్వాసన వెదజల్లుతోందన్నారు. పేరుకున్న పూడికను తొలగించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో ఖాజావలి, హాజీ అఫ్తాబ్ హుసేన్, తన్వీర్, అల్తాఫ్, రహీం, అజీజ్, రఫీ, జలాల్‌లున్నారు.
నేడు విగ్రహ ప్రతిష్టాపన
బళ్లారిటౌన్: నగరంలోని వాల్మీకి సర్కిల్‌లో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం 5 గంటల నుంచి తమ సముదాయం ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకుంటామని ఆ సముదాయం నేత బీ.రాంప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్రతో పాటు రాష్ట్రంలోని పలు తమ సముదాయాల నేతలు కూడా పాల్గొంటారన్నారు.
వాయిదా??
కాగా గొడవల నేపథ్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కాంగ్రెస్ కార్యాలయం నుంచి సమాచారం అందింది.
స్పిన్నింగ్ మిల్లు భూమి విక్రయించొద్దు
రాయచూరు రూరల్: తాలూకాలోని యరమరస్ వద్ద ఉన్న ప్రభుత్వ స్పిన్నింగ్ మిల్లు భూమిని ప్రైవేట్ వారికి విక్రయించడం తగదని సామాజిక ఆందోళనకారుడు శివకుమార్ ఆరోపించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పిన్నింగ్ మిల్లుకు చెందిన 40.25 ఎకారాల భూమిని ప్రైవేట్ భాగస్వామ్యానికి విక్రయించే ముందు కార్మికులకు దక్కాల్సిన బకాయి వేతనాలు, ఇతర బిల్లులు చెల్లించాలన్నారు. 550 మంది పని చేసిన స్పిన్నింగ్ మిల్లులో కార్మికులకు పునర్వసతి కల్పించాలన్నారు. మూతపడిన యరమరస్ స్పిన్నింగ్ మిల్లును తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
‘నీ వల్లే తుపాకీ సంస్కృతి’
● మాజీ బుడా అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి
బళ్లారిటౌన్: నగరంలో గన్‌మెన్ల సంస్కృతి 2008లో బీజేపీ ప్రభుత్వ హయాంలో జనార్దనరెడ్డి నుంచే ప్రారంభమైందని మాజీ బుడా అధ్యక్షుడు ఎన్.ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి, గాలి జనార్దనరెడ్డి సహించలేక పోతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నారా కుటుంబాల గురించి జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ నాయకులు, మేయర్ గాదెప్ప, ముండ్రిగి నాగరాజు, కుబేర, జగన్, సమీర్, సిద్దేశ్, ఎల్.మారెన్న, సూరి, మానయ్య తదితరులు పాల్గొన్నారు.
కొత్త పైపులైన్లు
ఏర్పాటు చేయరూ
రాయచూరు రూరల్: నగరంలోని లాల్ బహుద్దూర్ శాస్త్రి నగరలో కొత్త తాగునీటి పైపులైన్లను ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఎండీ గౌస్ మాట్లాడారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి పైపులైన్ల అమర్చాలన్నారు. ఈ విషయంలో అధికారులు మౌనం వహించడం తగదన్నారు. అల్లమ ప్రభు కాలనీ నుంచి పాత ఆస్పత్రి వరకు ఉన్న పాత పైపులైన్లను తొలగించి కొత్త పైపులైన్లను ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
అయ్యప్ప స్వామి ఊరేగింపు
కెలమంగలం: తాలూకా కేంద్రం డెంకణీకోటలో ధర్మస్థల అయ్యప్ప భక్తమండలి ఆధ్వర్యంలో మండల పూజ ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అయ్యప్ప స్వామి ఆలయంలో మూలవిరాట్‌కు అభిషేకం చేసి, అలంకరించారు. అనంతరం అయ్యప్ప స్వామిని రథంపై కొలువుదీర్చి పట్టణ వీధుల్లో ఊరేగించారు. కొంత మంది భక్తులు పంపా వాయుద్యాలతో నృత్యం చేశారు. అయ్యప్ప మాలధారుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
వార్డులో సమస్యలు తీర్చండి
వార్డులో సమస్యలు తీర్చండి


