బడ్జెట్ కసరత్తు లేదేమిటీ?
కారణాలు ఏమిటి
శివాజీనగర: పూర్తికాలం నేనే ముఖ్యమంత్రిని, నేనే ఈసారి బడ్జెట్‌ను కూడా సమర్పిస్తా అని సీఎం సిద్దరామయ్య చెబుతున్నారు. కానీ
ఆయన ఇప్పటివరకు బడ్జెట్ సన్నాహాక సమావేశాలను ఆరంభించకుండా తటస్థంగా ఉండటంపై పలు అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఆర్థికశాఖను కూడా చూస్తున్న సిద్దరామయ్య ప్రతి సంవత్సరం డిసెంబర్ నాటికే బడ్జెట్ తయారీ గురించి ఐఏఎస్‌లతో సమావేశాలకు శ్రీకారం చుట్టేవారు. అయితే ఈసారి ఆ సమావేశాల జోలికి వెళ్లకపోవడం ఆశ్చర్యకారకమైంది. ఇటీవల హోం మంత్రి జీ.పరమేశ్వర్ మాట్లాడుతూ బడ్జెట్ సమీపిస్తోంది. పార్టీలో గొడవలపై కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా ఒకరు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, అయితే అది ఎవరనేది స్నష్టంగా తెలియజేయాలని చెప్పడం గమనార్హం.
డిప్యూటీ సీఎం సమీక్షలు?
డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్, ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబడుతున్నారు. ఆయన బడ్జెట్ రూపకల్పన గురించి ఆర్థిక శాఖ అధికారులతో అనధికారికంగా చర్చించారని ప్రచారంలో ఉంది. ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చి మొదట్లో రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రకటితమవుతుంది. ప్రతిశాఖ అవసరాలు, గతంలో కేటాయించిన నిధుల వాడకం, కొత్త అంశాల గురించి బడ్జెట్ తయారీ సమావేశాల్లో చర్చించడం ఆనవాయితీ. ఇది ఆర్థికమంత్రి, సీఎం కలిసి చేస్తారు. సీఎం వద్దే ఆర్థికశాఖ ఉండడంతో సిద్దరామయ్యే ఆ పనిచేస్తారు. ఈసారి అలాంటి సమావేశాల జాడ లేదు. ఇటీవల కేరళకు వెళ్లి వచ్చిన సిద్దరామయ్య అక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్‌తో చర్చలు జరిపారు.
నిర్లిప్తంగా సీఎం సిద్దరామయ్య
సీఎం కుర్చీ వివాదమే కారణమా?
రెండు అల్పాహార భేటీల తరువాత డీకే శివ వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉన్నారు. హైకమాండ్ ఆదేశాలను పాటిస్తానని సీఎం సిద్దరామయ్య చెబుతున్నారు. హైకమాండ్ నుంచి సిగ్నల్స్ రావడంతో బడ్జెట్ కసరత్తు అవసరం లేదని సిద్దరామయ్య భావిస్తున్నారా? అనే వాదనలు ఊపందుకున్నాయి. ఏదేమైనా వారంరోజుల్లో ఏదో ఒకటి తేలిపోనుంది. ఇప్పటికే 16 బడ్జెట్‌లను ప్రవేశపెట్టి 17వ బడ్జెట్ ద్వారా కొత్త రికార్డు సృష్టించేందుకు సిద్దరామయ్య సిద్ధమయ్యారు. ఈ దశలో ముఖ్యమంత్రి సీటు తగాదాలు అయోమయ స్థితిని కల్పించాయా? అనే సందేహాలున్నాయి. అనేకమంది కాంగ్రెస్ నాయకుల మదిలోనూ ఇదే ప్రశ్న మెదులుతోంది.


