ఆలయాల్లో జంతు బలిని అరికట్టండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో జంతు బలిని నియంత్రించాలని, కేంద్ర ప్రభుత్వం గోమాంసం విక్రయంపై నిషేధానికి చర్యలు చేపట్టాలని విశ్వవాణి కల్యాణ మండలి, బసవ ధర్మ జ్ఞాన పీఠం సంచాలకుడు దయానంద స్వామీజీ పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెంటూ ఒకే బాటను అనుసరిస్తున్నాయని విమర్శించారు. పశు వధ చట్టాలను రుద్దడం తగదన్నారు. కార్పొరెట్ రంగాలకు మద్దతు పలికే సర్కార్లకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలో 36 వేల ఆలయాలున్నాయన్నారు. వాటిలో పశువులు, గొర్రెలు, మేకలు తదితర జంతువులను బలివ్వడం సరికాదన్నారు. సింధనూరు తాలూకా సోమలాపుర వద్ద అంబా మఠంలో వారం రోజుల పాటు జరగనున్న జాతరలో 10 వేలకుపైగా జంతువులు, పశువుల బలిని అరికట్టేలా, హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకుండా జిల్లాధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.


