రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
హుబ్లీ: హుబ్లీ కార్వార రోడ్డు అంచటగేరి వద్ద మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో తండ్రి, బిడ్డ మృతి చెందారు. వివరాలు.. తడస నివాసి మెహబూబ్ ఖాన్ తన కుమార్తెలు అయిన అస్ల్మెన్, అజీజాతో కలసి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. హుబ్లీ నుంచి తడసకు వెళ్తున్న క్రమంలో మెహబూబ్ ముందు వెళ్తున్న బస్సును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అకస్మాత్తుగా బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో మెహబూబ్ ఖాన్ (36) అస్ల్మెన్ (2) అక్కడికక్కడే మృతి చెందారు. అజీజా తీవ్రంగా గాయపడటంతో కేఎంసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పిల్లల వార్డు విభాగం హెచ్‌ఓడీ విలేకరులకు తెలిపారు.
2 నుంచి
అంబామఠ ఉత్సవాలు
రాయచూరు రూరల్: సింధనూరు తాలూకా అంబామఠంలో జనవరి 2 నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సింధనూరు శాసన సభ్యుడు హంపన గౌడ బాదర్లి వెల్లడించారు. మంగళవారం సింధనూరు పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 3వ తేదీన ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్ వస్తున్నట్లు తెలిపారు. సింధనూరులో రూ.400 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారని వెల్లడించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన అంబాదేవి ఉత్సవాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. జానపద జాతర, నృత్యం, హాస్య సంజె, దేవి పల్లకీ సేవ, నాటకాలు, కుంభోత్సవం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ అరుణ్ దేశాయి, టీపీఈఓ చంద్రశేఖర్, ఖాజీ, మాలిక్ పాల్గొన్నారు.


