బంగ్లాదేశీయులను తరిమేస్తాం
సాక్షి బళ్లారి: నగరంలోని కౌల్‌బజార్ ప్రాంతంలో అక్రమంగా వచ్చి నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరులను తరిమేస్తామని మాజీ మంత్రి శ్రీరాములు తెలిపారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నగరంలో ఎస్‌పీ సర్కిల్ వద్ద వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గతంలో వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వాల్మీకి సర్కిల్‌గా నామకరణం చేశామని తెలిపారు. ప్రస్తుతం దాని పక్కనే మరో విగ్రహం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కనకదాసు, అంబేడ్కర్, బసవణ్ణ విగ్రహాలు కూడా ఉన్నాయని.. వాటి పక్కనే మళ్లీ విగ్రహాలు ఏర్పాటు చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు. నగరంలోని పలు కళాశాలల్లో గంజాయి విక్రయాలను అరికట్టడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హోంమంత్రి పరమేశ్వర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఉమ్మడి బళ్లారి జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. యలహంక సమీపంలోని కోగిల కాలనీలో సంబంధించిన స్థలం విచారణపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా 140 అసెంబ్లీ రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విసిగిపోయారన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్, కార్పొరేటర్ ఇబ్రహీం బాబు, కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు గోవిందరాజులు, హనుమంతప్ప, కల్పన వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


