ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేశాం
హొసపేటె: అన్నభాగ్య ద్వారా ప్రతి ఇంటికీ ఉచిత బియ్యం పంపిణీ చేసి మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేశాం. రాష్ట్రంలో ప్రాథమిక అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. అన్ని రంగాలకు గ్రాంట్లు అందిస్తున్నట్లు పట్టణాభివృద్ధి, పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి భైరతి సురేష్ స్పష్టం చేశారు. మంగళవారం విజయనగర జిల్లా హరపనహళ్లి పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన అమృత్ 2.0 ప్రాజెక్ట్ కింద హరపనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండున్నర సంవత్సరాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో విజయనగర జిల్లాకు పట్టణాభివృద్ధి శాఖ నుంచి రూ.360 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పంచ గ్యారెంటీ పథకాలకు రూ.60,000 కోట్లు కేటాయించి సామాన్య ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి గృహిణికి నెలకు రూ.2000, శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లత మల్లికార్జున, తగ్గిన మఠం స్వామి, జిల్లాధికారి కవితా ఎస్.మన్నికేరి తదితరులు పాల్గొన్నారు.


