కేఎంసీ ఆస్పత్రిపై లోకాయుక్త దాడి
హుబ్లీ: స్థానిక కేఎంసీ పరిశోధన కేంద్రం ఆస్పత్రిపై లోక్తాయుక్త పోలీసులు మంగళవారం దాడి చేసి రికార్డులను క్షుణంగా పరిశీలించారు. ఆస్పత్రిలో ఔషధాలను బయటకు రాసి ఇస్తున్నారన్న ఆరోపణలతో పాటు ఓ వ్యక్తి ఇంజక్షన్ కోసం అవస్థలు పడిన వీడియో ఇటీవల సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని ఉప లోకాయుక్త న్యాయమూర్తి ఫణీంద్ర ఆదేశించారు. దీంతో ధార్వాడ జిల్లా లోక్తాయుక్త ఎస్పీ సిద్దలింగ నేతృత్వంలో అధికారులు కేఎంసీ పరిశోధన కేంద్రం ఆస్పత్రిపై దాడి చేశారు. ఆయా విభాగాల్లోని రికార్డులను క్షుణంగా పరిశీలించారు. లోక్తాయుక్త ఎస్పీ మాట్లాడుతూ.. 12 బృందాలుగా ఏర్పడి 40 మంది సిబ్బందితో రోగుల నుంచి వివరాలు సేకరించి స్వచ్ఛంధ కేసు దాఖలు చేసుకున్నామన్నారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ హొసమని మాట్లాడుతూ.. రాష్ట్ర డిప్యూటీ లోక్తాయుక్త ఆదేశాల మేరకు జిల్లా లోకయుక్త అధికారులు ఆస్పత్రి వివిధ విభాగాల్లో రికార్డులు పరిశీలించారని తెలిపారు. వారికి అవసరమైన వివరాలు ఇవ్వడానికి సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. అధికారుల దర్యాప్తునకు అన్ని విధాలా సహకరిస్తామని వెల్లడించారు.


