స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ సేవలు అనన్యం
రాయచూరు రూరల్: దేశానికి స్వాతంత్య్రం తేవడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు అనన్యమని విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 141వ కాంగ్రెస్ పార్టీ సంస్థాపనా దినోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల నుంచి భరత మాత సంకెళ్లను తొలగించిన పార్టీగా కాంగ్రెస్‌ను అభివర్ణించారు. భారతీయుల్లో ఐక్యత లేకపోవడంతో ఆంగ్లేయులు 400 ఏళ్ల పాటు దేశాన్ని పాలించి సంపదను కొల్లగొట్టారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకమై పోరాటం చేయడంతో మన దేశానికి స్వాతంత్య్రం లభించిందని గుర్తు చేశారు. భారత ప్రధానమంత్రిగా నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు. పంచశీల సూత్రాలతో దేశానికి పేరు తెచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, శాలం, అస్లాంపాషా, రజాక్ ఉస్తాద్, నిర్మల బెణ్ణే, దరూరు బసవరాజ్, రామకృష్ణ నాయక్, మురళి యాదవ్, మర్రిస్వామి, ఈశప్ప, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


