ముస్తాబవుతున్న రెడ్డి భవన్
సాక్షి బళ్లారి: బళ్లారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుల నిధులతో బళ్లారి జిల్లాకే కాకుండా ఉత్తర కర్ణాటకకే తలమానికంగా ఉండేలా రెడ్డి భవన్‌ను నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. రాజకీయంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన వారితో పాటు అదే వర్గానికి చెందిన వారి నుంచి మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి భవన్ కోసం విరాళాలు సేకరించారు. నగరం నడిబొడ్డున అనంతపురం రోడ్డులోని శ్రీశాంతి నికేతన్ స్కూల్ ఆవరణలో రెడ్డి సంఘానికి చెందిన విశాలమైన స్థలంలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ రెడ్డి భవన్ కల్యాణ మండపంలో వేలాది మంది కూర్చొనేందుకు ఇబ్బందులు లేకుండా, భోజన వసతి శాల, అద్భుతమైన వివాహ వేదికకు సంబంధించిన ఫంక్షన్ హాల్, వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఇలా బళ్లారిలోనే అన్ని కల్యాణ మండపాలకు ఽ దీటుగా ఏడాదిలో భవనాన్ని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రెడ్డి సంఘం ఏర్పడి మరో ఏడాదిలో 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రెడ్డి భవన్‌ను అదే రోజు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్డి సమాజిక వర్గంలో ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో రెడ్డి భవన్ ఎదురుగా మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో ఇప్పటికే అల్లం భవన్, అంబేడ్కర్ భవన్, రాఘవ కళామందిర్, బసవ భవన్, కమ్మ భవన్, పద్మశాలీ కల్యాణ మండపం, గ్రాండ్ ఫంక్షన్ హాల్, క్లాసిక్ ఏసీ ఫంక్షన్ హాల్, కేఎస్‌ఆర్, కేఈబీ ఫంక్షన్ హాల్స్, తదితర కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. పెళ్లి వేడుకలు, ఇతర ప్రముఖ ఫంక్షన్లు, రాజకీయ సమావేశాలు, నిర్వహించుకునేందుకు అనువుగా ఉండటంతో బళ్లారి ప్రాంత వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు జిల్లాలకు చెందిన వారు ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయంగా, వ్యాపార రంగాల్లో అత్యున్నత పదవులు పొందిన రెడ్డి సామాజిక వర్గం బళ్లారిలో రెడ్డి భవన్ నిర్మించేందుకు ముందుకొచ్చింది.
జోరుగా జరుగుతున్న రెడ్డి భవన్ నిర్మాణ పనులు
పెరుగుతున్న జనాభా
రూ.15 కోట్ల వ్యయంతో
అద్భుతంగా నిర్మాణం
బళ్లారికే తలమానికంగా
మారబోతున్న కల్యాణ మండపం
ఏడాదిలో పూర్తికానున్న పనులు
వివాహాలు, ఇతర కార్యక్రమాలకు
వినియోగించుకునేందకు రూపకల్పన
చారిత్మకంగా గుర్తింపు పొందిన బళ్లారి జిల్లాలో రోజు రోజుకు జనాభా పెరుగుతోంది. వివిధ రకాలుగా వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందుతోంది. దేశంలోనే పేరుగాంచిన, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జిందాల్ స్టీల్ ఇండస్ట్రీ, స్పాంజ్ ఐరన్ కంపెనీలు, లక్షలాది ఎకరాలకు నీరందించే తుంగభద్ర డ్యామ్, స్పాంజ్ ఐరన్ కంపెనీలు ఇలా చెప్పుకుంటూ పోతే పత్తి వ్యాపారం, వేరుశనగ, తదితర వ్యాపార కేంద్రాలకు బళ్లారి కేంద్ర బిందువుగా మారింది.
ముస్తాబవుతున్న రెడ్డి భవన్


