తగ్గిన మిర్చి దిగుబడి..రైతన్న కంటతడి
రాయచూరు రూరల్: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతన్నలకు కాలం కలసి రావడం లేదు. అప్పులు చేసి మరి పంటలు సాగు చేస్తున్నారు. అయితే సకాలంలో వర్షాలు కురవక పోవడం, కాలువల ద్వారా పంటకు నీరు అందకపోవడంతో ఆశించిన దిగుబడులు రావడం లేదు. జిల్లాలో క్రిష్ణా నది ఉన్నా.. నారాయణపుర కుడి కాలువ నుంచి పంటల సాగుకు నీరు అందడం లేదు. రాయచూరు జిల్లాలో 50 వేల ఎకరాలు, బాగలకోట జిల్లాలో 11 వేల ఎకరాలు, యాదగిరి జిల్లాలో 8 వేల ఏకరాలు, కలబుర్గి జిల్లాలో 5 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. కాలువకు నీరందక, వర్షాలు సకాలంలో కురువక భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణ పుర కుడి కాలువల ఆయుకట్టు చివరి భూములకు నీరు అందలేదు. పొలాల్లో బోర్లు వేయించుకుని పంటలు పండించాలన్న భూగర్భ జలమట్టం తగ్గింది. దీనికి తోడు విద్యుత్ కోతలు అధికమయ్యాయి. మిరప పంటను కాపాడుకునేందుకు రైతులు కడవలతో నీరు పోశారు. గుంటూరు మిర్చి గతంలో 10 క్వింటాళ్ల దిగుబడి రాగా.. నేడు కేవలం 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని రైతులు లబోదిబోమంటున్నారు. గత ఏడాది బ్యాడిగి మిర్చి క్వింటా ధర రూ.65 వేలు పలకగా.. నేడు రూ.40 వేలకు పడిపోయింది. గతంలో క్వింటా గుంటూరు మిర్చి ధర రూ.22 పలికింది. ప్రసుత్తం క్వింటా రూ.15 వేలు మాత్రమే ధర పలుకుతోంది. నారాయణపుర కుడి, ఎడమ కాలువల కింద యాదగిరి, రాయచూరు జిల్లాలో రూ.400 కోట్లు విలువ చేసే మిరప పంటకు నీరు లేక ఎండిపోయే దశలో ఉంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు 6 టీఎంసీల నీరు వదిలేందుకు మంత్రులు శరణ బసప్ప దర్శానపూర్, శరణ ప్రకాష్ పాటిల్ చొరవ చూపాలని రైతు ప్రభాకర్ పాటిల్ కోరుతున్నారు.
సకాలంలో పంటకు అందని నీరు
పడిపోయిన దిగుబడులు
లాభాలు అంతంతమాత్రమే
తగ్గిన మిర్చి దిగుబడి..రైతన్న కంటతడి


