వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తాం
సాక్షి బళ్లారి: రైతులు ఒకే పంటపై ఆధారపడి నష్టపోతూ అప్పుల పాలవుతున్నారు. వివిధ రకాల పంటలు, పండ్ల తోటలు వేసుకుని అధిక లాభాలు పొందాలని జిందాల్ సంస్థ సౌత్ జోనల్ ప్రముఖుడు పెద్దన్న బిడాళ సూచించారు. ఆదివారం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని సండూరు తాలూకా తాళూరు గ్రామంలో రైతులతో కార్యక్రమం నిర్వహించారు. హగరి వ్యవసాయ విజ్ఞాన కేంద్ర ప్రముఖులు పాలయ్య, డాక్టర్ రవి, ఇఫ్కో బళ్లారి మేనేజర్ హనుమంతప్ప, తదితరులు రైతులతో చర్చావేదిక ఏర్పాటు చేశారు. పంట పొలాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాళూరు చుట్టపక్కల గ్రామాల్లో 300 మందికిపైగా రైతులను జిందాల్ సంస్థ ఎంపిక చేసిందన్నారు. ఆయా రైతులకు జిందాల్ సంస్థ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. భూమికి అనుగుణంగా పంటలను వేసేందుకు సహకారం అందిస్తామని వెల్లడించారు. వ్యవసాయంతో పాటు గిరిరాజ కోళ్లు, మేకల పెంపకాన్ని సహకారం అందిస్తామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో దశల వారీగా సమగ్ర వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిందాల్ సంస్థ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రసాయనిక మందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అనుసరించి అధిక లాభాలు పొందాలని రైతులకు సూచించారు.


