పాత్రికేయుల సంక్షేమానికి కృషి
కోలారు: పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ తెలిపారు. ఆదివారం నగరంలోని పాత్రికేయుల భవనంలో జిల్లా పాత్రికేయుల సంఘం నూతన పదాధికారుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లో ఎదగి రావడానికి కారణం పాత్రికేయులే అన్నారు. జిల్లా పాత్రికేయుల సంఘం సంక్షేమ నిధి ఏర్పాటు ఉత్తమ ఆలోచన అని.. ఇందుకోసం రూ. 21 లక్షలు విరాళంగా అందిస్తామని హామీ ఇచ్చారు. పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు శివానంద తగడూరు మాట్లాడుతూ.. కోలారు పాత్రికేయుల సంఘం ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన అనంత రాము పనితీరును కొనియాడారు. పాత్రికేయులు దురహంకారాన్ని వీడి ప్రామాణికంగా విధులు నిర్వహించాలన్నారు. మన రాతల ద్వారా సమాజంలో మార్పులు తీసుకు వచ్చే ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు ఎస్.కె చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.మునిరాజు, సంఘం అధ్యక్షుడు బి.వి.గోపినాథ్, రాష్ట్ర సంఘం కోశాధికారి వాసుదేవహొళ్ల తదితరులు పాల్గొన్నారు.


