కబ్జాల తొలగింపు.. కేరళ కయ్యం
బనశంకరి: బెంగళూరులో యలహంకలో కోగిలు లేఔట్‌లో వలస కూలీల ఇళ్లను గ్రేటర్ బెంగళూరు అధికారులు కూల్చివేయడంపై కేరళ సర్కారు ఆగ్రహంతో ఉంది. ఆ ప్రదేశాన్ని ఆదివారం కేరళ ఎంపీ, ఎమ్మెల్యేలు సందర్శించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కేరళ దర్బార్ ఏమిటి, పదేపదే కర్ణాటకలోకి ఎందుకు జోక్యం చేసుకుంటోంది అనే విమర్శలు వెల్లువెత్తాయి. కేరళ ఎన్నికలలో లబ్ధిని పొందేందుకు కర్ణాటకను వాడుకుంటున్నారనే ప్రచారం ఉంది. కోగిలు లేఔట్‌లో కేరళ నుంచి వలసవచ్చిన కూలీలు, జనం అక్రమంగా స్థలాలను ఆక్రమించి ఇళ్లు, షెడ్లు కట్టుకున్నట్లు కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు ఇళ్లను తొలగించారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపణలతో గొడవ మొదలైంది. ఇంతలో కేరళకు చెందిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ జోక్యం చేసుకున్నారు. సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే.శివకుమార్‌తో మాట్లాడి మానవతా దృక్పథం ఆధారంగా ఆశ్రయం కల్పించాలని సూచించారు. పార్టీలో ఆయన సీనియర్ కావడంతో సీఎం, డీసీఎంకు కూడా ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది.
ఎప్పుడూ ఇంతేనా
మలయాళీలు తమ రాజకీయాల కోసం పదేపదే కర్ణాటక ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారని విమర్శలున్నాయి. మానవతా దృక్పథం పేరుతో కర్ణాటక నుంచి తరచూ సాయాన్ని పొందుతోంది. వరదలు, అడవి జంతువుల దాడులకు సహాయం పొందింది. బండీపుర అడవిలో రాత్రివేళ కేరళ వాహనాల ప్రయాణానికి ఒత్తిడి చేస్తోంది. దీనిని జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేరళ ఎంపీ ఏఏ.రహీం కోగిలు లేఔట్‌లో పరిశీలించారు. ఆదివారం కేరళ మాజీ మంత్రి ఎమ్మెల్యే జలీల్ పరిశీలించారు. ఆయన వెంట మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం ఉన్నారు.
అర్హులైన వారికి పునరావాసం: డీసీఎం
కోగిలు లేఔట్ చెత్త తరలింపు ప్రదేశంలో ఆక్రమణల తొలగింపుతో నిరాశ్రయుల్లో అర్హులు, స్థానికులకు పునరావాసం కల్పిస్తామని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. ఆదివారం నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోగిలు లేఔట్ బాధితులకు రాజీవ్‌గాంధీ వసతి పథకం కింద ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఈ విషయంలో కేసీ వేణుగోపాల్ ట్వీట్ పై బీజేపీ విమర్శలు చేశారనగా, తమ పాలనలో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. వేణుగోపాల్ మా పార్టీ ప్రధాన కార్యదర్శిగా సలహాలు ఇవ్వడానికి అధికారం ఉంది, బీజేపీ జాతీయ నేతలు వచ్చి రాష్ట్ర నేతలకు సలహాలు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. అక్కడ అక్రమంగా షెడ్లు వేసుకున్న వారు ఏ మతంవారు ఎంతమంది ఉన్నారు అనే సమాచారం సేకరించామన్నారు, చట్టం అందరికీ ఒక్కటే. అక్కడ నేను కూడా పరిశీలించానని, ఓ వ్యక్తి వారి నుంచి డబ్బు తీసుకుని ప్రభుత్వ స్థలంలో షెడ్లు వేసుకోవాలని చెప్పాడన్నారు.
బెంగళూరు కోగిలులో
చెత్త యార్డు స్థలంలో
గుడిసెలు, షెడ్ల కూల్చివేతలు
మలయాళీల తీవ్ర అభ్యంతరాలు
కబ్జాల తొలగింపు.. కేరళ కయ్యం


