లారీని బస్సు ఢీ, 21 మందికి గాయాలు
యశవంతపుర: ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్, 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హాసన్ జిల్లా చన్నరాయపట్టణ తాలూకా బైపాస్ రోడ్డులో జరిగింది. శనివారం రాత్రి ప్రైవేట్ బస్సు 40 మంది ప్రయాణికులతో వెళుతుండగా ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బస్సు ఢీకొంది. 7 మంది ప్రయాణికులకు ఓ మోస్తరుగా, 13 మంది ప్రయాణికులకు బలమైన గాయాలు కావడంతో వారిని జిల్లా ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జుయింది. బస్సు డ్రైవర్ పరిస్థితి అందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఫోన్ రీచార్జి గొడవలో హత్య, 4 ఏళ్ల జైలుశిక్ష
శివమొగ్గ: ఘర్షణలో ఒకరిని హత్య చేసిన కేసులో నిందితునికి జిల్లాలోని సాగర్ 5వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. వివరాలు.. స్థానిక మురల్లి గ్రామవాసి సిద్దప్ప (38) దోషి. 2022 డిసెంబరులో తిమ్మప్ప (52), అతని భార్యతో మొబైల్‌ఫోన్ రీచార్జి గురించి సిద్దప్ప గొడవపడ్డాడు. అతను వారి ఇంటికి వెళ్లి టీవీ డిష్ బుట్టను కట్టెతో కొట్టాడు. తరువాత తిమ్మప్ప తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తిమ్మప్పను ఉడిపి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా మరణించాడు. కార్గల్ పోలీస్ స్టేషన్‌లో సిద్ధప్పపై హత్య కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్‌ను దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఆర్ రవీంద్ర ఈ తీర్పు ఇచ్చారు. అలాగే రూ.14 వేల జరిమానా కూడా విధించారు. ప్రభుత్వం తరపున వకీలు అన్నప్ప నాయక్ వాదించారు.
ప్రేమ పేరుతో సర్వం లూటీ
● బెంగళూరులో బడా కిలాడీ
దొడ్డబళ్లాపురం: ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను నమ్మించి సర్వం దోచుకుని మోసగిస్తున్న నయ వంచకుని ఉదంతమిది. చివరకు బాధితులు ఫిర్యాదు చేయడంతో బెంగళూరు బాగలగుంట పోలీసులు గాలించి అరెస్టు చేశారు. హరియానాకు చెందిన శుభాంశు శుక్లా (27) ఆ కిలాడీ. ఇతడు గత నాలుగేళ్లుగా బెంగళూరులోని టీ దాసరహళ్లిలో నివసిస్తున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పుకుని ఫేస్‌బుక్, ఇన్‌స్టా తదితరాల ద్వారా నిందితుడు స్థానిక యువతులను ట్రాప్ చేయడం ప్రారంభించాడు. ముందు పరిచయం చేసుకుని, ఆపై తీయని మాటలతో ప్రేమ వల విసరడం, వారి నుంచి భారీ మొత్తాల్లో డబ్బు తీసుకోవడం, ఇతరత్ర మోసగించడం ఇతని నైజం. ఓ యువతితో ఇలాగే ప్రేమాయణం నడుపుతున్నాడు. ఆమె ద్వారా ఆమె మైనర్ చెల్లెలిని కూడా మభ్యపెట్టి లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. వారి నుంచి రూ.34 లక్షలు వసూలు చేశాడు. ఇది తెలిసి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో అతని మోసాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి.
లారీని బస్సు ఢీ, 21 మందికి గాయాలు


