ఒక్క అనప.. వంద రుచులు
● బెంగళూరులో మేళా
బనశంకరి: బసవనగుడి నేషనల్ కాలేజీ మైదానంలో అనపకాయల మేళా ను శనివారం డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ప్రారంభించారు. అనపగింజలతో చేసిన వివిధ రకాల వంటకాలు నగరవాసులను నోరూరిస్తున్నాయి. అనపకాయల ఓలిగ, వడ, దోసె, ఇడ్లీ, సాంబారు, పాయసం, జిలేబీ, మైసూరు పాక్ ఇంకా అనేక తీపి, కారం వంటకాలు లభిస్తున్నాయి. జనవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. టీవీ నటి భవ్య గౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనప వంటకాలను రుచిచూశారు.
దర్శన్ భార్యపై సుదీప్ గుస్సా
దొడ్డబళ్లాపురం: చెంపమీద కొడితే కొట్టించుకునేంత మంచివాన్ని కాదని, ప్రేమతో తల్లి కొడితే అది వేరే విషయమని, అదే పక్కింటి వాడు కొడితే చూస్తూ ఊరుకోనని ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ అన్నారు. కొన్నిరోజులుగా సుదీప్, దర్శన్ భార్య, ఫ్యాన్స్‌తో ఆయనకు మాటల యుద్ధం జరగడం తెలిసిందే. ఇంతలో కొందరు సోషల్ మీడియాలో దర్శన్ భార్య విజయలక్ష్మి పై అశ్లీల కామెంట్లు పోస్టు చేశారు. వీటిని ఆమె స్క్రీన్ షాట్ తీసి క్లాస్ ఫ్యాన్స్ అని సుదీప్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. మామూలుగా సుదీప్ అభిమానులను ఇలానే పిలుస్తారు. దీంతో సుదీప్ ఆగ్రహానికి గురయ్యారు. చెంపమీద కొడితే చూస్తూ ఊరుకోమని అభిమానులకు మద్దతుగా నిలిచారు. తాను గొడవలు పెట్టుకోవడానికి రాలేదన్నారు.
బంగ్లాదేశ్ హిందువులను కాపాడండి
కోలారు: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలు, హత్యలను ఖండిస్తూ శనివారం హిందూ సంఘాల కార్యకర్తలు నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. సంఘాల నేతలు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో రోజురోజుకూ హిందువులపై దౌర్జన్యాలు అధికం అవుతున్నాయని, దీపు దాస్ అనే హిందువును దారుణంగా హత్య చేశారు. హత్యకు ముందు చెట్టుకు ఉరివేసి చిత్ర హింసలకు గురిచేశారన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీపుదాస్ హంతకులను కఠినంగా శిక్షించాలన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై నరమేధానికి పాల్పడడం అత్యంత హేయ కృత్యమని, తక్షణం అల్లరి మూకలకు అడ్డుకట్ట వేయాలన్నారు.
ప్రమాదాల కట్టడికి
కేంద్రానికి లేఖ
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసింది. ఇకపై రాత్రివేళ బస్సులు నడిపే డ్రైవర్లు కనీసం రెండు గంటలు విశ్రాంతి తీసుకునేలా నిబంధనలు విధించాలని కోరింది. రాత్రి 12 నుంచి తెల్లవారుజాము 4గంటలలోపు డ్రైవర్ రెండు గంటలపాటు విశ్రాంతి తీసుకుకోవాలనే నిబంధన ఉన్నా ఎవరూ పాటించడం లేదు. ఇకపై జీపీఎస్ టెక్నాలజీ ద్వారా విశ్రాంతిని నిర్ధారించే అధికారం రవాణాశాఖకు ఇవ్వాలనేది డిమాండు ఉంది. అలాగే డ్రైవరు నిద్రమత్తులోకి జారుకుంటే అలర్ట్ చేసే సాంకేతికతను డ్రైవర్ క్యాబిన్‌లో అమర్చాలి. డ్రైవర్ నిద్రమత్తుకు గురైతే వెంటనే అలారం మోగుతుంది.
చిరుత బందీ
మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని హరదనహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మనహళ్లి గ్రామవాసులకు ఇబ్బందిగా మారిన చిరుత పులి బోనులోకి చిక్కింది. కొన్నివారాలుగా చిరుతపులి ఇక్కడ తిరుగుతూ కుక్కలను ఎత్తుకెళ్తోంది. చిరుతను చూసిన గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వారి ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు చిరుత కోసం గాలించి అక్కడక్కడ బోనులు ఉంచారు. శనివారం తెల్లవారుజామున ఓ బోనులోకి చిరుత చిక్కింది. దానిని అక్కడి నుంచి తరలించారు.
ఒక్క అనప.. వంద రుచులు
ఒక్క అనప.. వంద రుచులు


