వైకుంఠ ఏకాదశి దర్శనాలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

వైకుంఠ ఏకాదశి దర్శనాలకు ఏర్పాట్లు

Dec 28 2025 8:32 AM | Updated on Dec 28 2025 8:32 AM

వైకుంఠ ఏకాదశి  దర్శనాలకు ఏర్పాట్లు

వైకుంఠ ఏకాదశి దర్శనాలకు ఏర్పాట్లు

బనశంకరి: పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 30న బెంగళూరులోని వయ్యాలికావల్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి (టీటీడీ) ఆలయంలో విశేష దర్శనాలు కల్పిస్తారు. ఏర్పాట్ల వివరాలను శనివారం తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్‌ ఉంటుందన్నారు. రూ.200 టికెట్‌ తీసుకుంటే త్వరగా దర్శనం లభిస్తుందని తెలిపారు. క్యూలైను చౌడయ్య స్మారక భవనం 2వ మెయిన్‌రోడ్డు నుంచి ప్రారంభమౌతుందన్నారు. 80 వేల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు. ఆ రోజంతా కళాకారులతో భజనలు, భక్తగాన కచేరీలు జరుగుతాయన్నారు. టీటీడీ ప్రముఖులు కే.వీరాంజనేయులు, ఎస్‌.నరేశ్‌కుమార్‌, అధికారిణి జయంతి పాల్గొన్నారు.

పులి దాడి.. జనం ధర్నా

మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా గురుపుర చెరువు వద్ద పులి దాడిలో ఒక ఎద్దు మరణించింది. మున్నా అనే వ్యక్తికి చెందిన ఎద్దును చెరువు సమీపంలో మేత కోసం కట్టి ఉంచగా పులి దాడి చేసి చంపి రక్తం తాగింది. పదేపదే పులి దాడి చేస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఎద్దు కళేబరాన్ని గ్రామస్తులు ట్రాక్టర్‌లో తీసుకుని గురుపురలో హెచ్‌డీకోటె–హుణసూరు ప్రధాన రహదారిలో కొంతసేపు పెట్టి రాస్తారోకో చేశారు. అటవీ శాఖ అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే పులిని పట్టుకోవాలని, గ్రామం చుట్టుపక్కల పహారా పెంచాలని, ఎద్దు యజమానికి పరిహారం అందించాలని కోరారు.

బీదర్‌లో తీవ్ర చలి

దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గడం లేదు. బీదర్‌లో శుక్రవారంనాడు 6.3 డిగ్రీల సెల్సియస్‌ శీతల వాతావరణం నమోదైంది. పగలూ రాత్రి తేడా లేకుండా చలి తీవ్ర కొనసాగుతోంది. పైగా పొగమంచు కూడా వ్యాపిస్తోంది. దీంతో జనం నానా తంటాలు పడుతున్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో రాత్రి వేళ 10 సెల్సియస్‌ల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దక్షిణ లోతట్టు జిల్లాల్లో కనిష్టంగా 12, 14 డిగ్రీలుగా ఉంటోంది. బెంగళూరులో కనిష్ట ఉష్ణోగ్రత 12.5 నమోదవుతోంది. కోస్తాతీర ప్రాంతాలు, మిగతా జిల్లాల్లో సరాసరి 27, 29 డిగ్రీలుగా ఉంటోందని వాతావరణ శాఖ తెలిపింది.

అర్ధరాత్రి పోకిరీల వేధింపులు

కృష్ణరాజపురం: ఒకే బైకులో వెళుతున్న ముగ్గురు ఆకతాయిలు రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని వేధించారు. ఈనెల 25వ తేదీన అర్ధరాత్రి బీటీఎం లేఔట్‌లో ఈ కీచకపర్వం జరిగింది. స్కూటర్‌లో హెల్మెట్‌ ధరించి వెళుతున్న యువతిని బైక్‌లో హెల్మెట్‌ ధరించకుండా అడ్డదిడ్డంగా నడుపుతున్న యువకులు వెంటాడారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర యువతిని ఫాలో చేస్తూ పదే పదే అడ్డు వస్తూ వేధింపులకు గురి చేశారు. దీనిని ఓ కారులో వస్తున్న వ్యక్తి వీడియో తీసి పోలీసులకు ట్యాగ్‌ చేశాడు. బైక్‌ నంబరు, యజమాని వివరాలను కనుగొన్నామని, ముగ్గురు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని సుద్దగుంటెపాళ్య పోలీసులు ఎక్స్‌లో స్పందించారు.

నేడు కార్వారకు రాష్ట్రపతి రాక

బనశంకరి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఆదివారం కార్వార నగరంలో అరేబియా సముద్ర తీరంలోని కదంబ నౌకా స్థావరం సీ బర్డ్‌ని సందర్శిస్తారు. ఉదయం చేరుకుని, నౌకాదళ జలాంతర్గామిలో ప్రయాణిస్తారు. రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ కార్వారకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కార్వార పరిసరాలలో, సముద్ర తీరంలోను భారీ భద్రత ఏర్పాటైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3.30 వరకు కార్వార తీరంలో చేపల వేటను నిషేధించినట్లు మత్స్యకారులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement