మిత్రపక్షాల మధ్య పొత్తు రచ్చ
దొడ్డబళ్లాపురం: అధికార పార్టీలో అలా ఉండగా, ప్రతిపక్షాల్లోనూ లుకలుకలు బయటపడ్డాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తుకు తమ హైకమాండ్ ఆదేశిస్తే సిద్ధమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. పంచాయతీ ఎన్నికలలో బీజేపీతో తాము కలవబోమని దేవెగౌడ చెప్పడం తెలిసిందే, అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి మెజారిటీ సాధించాలని విజయేంద్ర చెప్పగా, ఆయన యంగ్‌స్టార్‌లా మాట్లాడుతున్నారని దళపతి చమత్కరించడం తెలిసిందే. దీంతో రెండుపార్టీలకు కేంద్ర స్థాయిలో పొత్తులు, రాష్ట్రంలో వైషమ్యాలు అనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో విజయేంద్ర బెంగళూరులో శనివారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవేగౌడ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన వ్యాఖ్యలను దేవేగౌడనే తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తొలగించడానికి జేడీఎస్ పెద్దలు దేవేగౌడ, కుమారస్వామి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా శిరసావహిస్తామన్నారు. ప్రతిసారీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమకు అధికారానికి 5, 10 సీట్లు తక్కువ వచ్చేవని, అందువల్ల తాను కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పూర్తి మెజారిటీ సంపాదించాలని చెప్పానన్నారు. తన మాటల్లో కానీ, దేవేగౌడ మాటల్లో కానీ తప్పులు వెతకవద్దని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జేడీఎస్‌తో పొత్తు ఉండదని మా పార్టీ వాళ్లు ఎవరూ చెప్పలేదన్నారు. బీజేపీతో పొత్తు ఉండదని మాజీ ప్రధాని చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. తమ అధిష్టానం ఇలాంటి వివాదాలను పరిష్కరిస్తుందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ గెలిచింది, బీజేపీ అధికారంలోకి రావాలనేది ప్రజల ఆకాంక్ష అని అన్నారు.
స్థానిక ఎన్నికల్లో ఉండదన్న దళపతి
ఉంటుందన్న బీజేపీ నేత విజయేంద్ర
మిత్రపక్షాల మధ్య పొత్తు రచ్చ


