మైసూరు ప్యాలెస్‌లో భద్రతా లోపాలు
మైసూరు: ప్యాలెస్ సిటీలో 25న రాత్రి అంబా విలాస్ ప్యాలెస్ ముందు హీలియం బెలూన్ల విక్రేత సిలిండర్ పేలిపోయిన ఘటనలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ దుర్ఘటనలో విక్రేత సలీం, ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా ఐదారుమంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నారు. ప్యాలెస్ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే విషయం బయటపడింది. సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాల ఫుటేజ్‌లను తీసుకోవడానికి వెళ్లిన పోలీసు అధికారులకు ప్యాలెస్ భద్రతా లోపాలు నివ్వెరపరిచాయి. ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో ఎలాంటి చిత్రాలు నమోదు కాకపోవడం ఆశ్చర్యకరం. ఇది 360– డిగ్రీల కెమెరా అని, కానీ అది చూసే కోణం పూర్తి తప్పుగా ఉందని తేలింది. జిల్లా, ప్యాలెస్ అధికారులు రూ.కోట్ల ఖర్చు చేసి కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఉపయోగం లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. పేలుడు దృశ్యాలు దర్యాప్తులో సహాయపడతాయి. కానీ ఫుటేజీ లేకపోతే ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.
తగ్గిన జన రద్దీ
శీతాకాల మాగీ ఫెస్టివల్‌ను చూడడానికి రోజూ వేలాది మంది దేశ విదేశీ పర్యాటకులు వస్తున్నారు. అలాగే, క్రిస్మస్ సెలవులు కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో విస్ఫోటం జరగడంతో అందరూ భయాందోళనకు లోనయ్యారు. శనివారం ప్యాలెస్ ఆవరణలో ఓ మోస్తరుగా జనం కనిపించారు.
పేలుడు స్థలం వద్ద ఉత్తుత్తి సీసీ కెమెరా
పోలీసులకు ఫుటేజీ లభించని వైనం
మైసూరు ప్యాలెస్‌లో భద్రతా లోపాలు


