కుర్చీ కోసం సీఎం, డీసీఎం పైరవీలు
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కుర్చీ కోసం పైరవీలు చేస్తుండటంతో పాటు ప్రజలు, రైతుల సమస్యలు విస్మరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. మంగళవారం నగరంలోని మోకా రోడ్డులోని వాజ్‌పేయి లేఅవుట్‌లోని బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రి రాజుగౌడ, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా తదితర ప్రముఖులు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అతివృష్టి, అనావృష్టితో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేసిన అప్పులు తీర్చలేక, పెట్టిన పెట్టుబడులు లేక రైతులు సమస్యల వలయంలో కూరుకు పోతున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై నిందలతో సరి
అయినా ఏ సందర్భంలోనూ ఈ ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోకపోవడంతో పాటు కేంద్రంపై నిందలు వేస్తూ తప్పించుకునే ధోరణి అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలల నుంచి ముఖ్యమంత్రి సీటును నిలబెట్టుకునేందుకు సీఎం సిద్దరామయ్య పడరాని పాట్లు పడుతున్నారన్నారు. సీఎం కుర్చీపై కూర్చునేందుకు డీకేశి అంతకన్నా ఎక్కువగా శ్రమిస్తున్నారన్నారు. ఈ ఇద్దరు నేతలకు జనం సమస్యలు ఏమాత్రం పట్టడం లేదన్నారు. ఆ పార్టీ హైకమాండ్ కూడా వీరిద్దరి సినిమా చూస్తున్నారే కాని ఫుల్‌స్టాప్ పెట్టడం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలు విస్మరించిన పాలకుల తీరుపై తాము పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నామన్నారు.
డ్యాంలో నీరున్నా రైతులకు మొండిచెయ్యే
ఈ ప్రాంతంలో రైతులకు అన్నం పెట్టే తుంగభద్ర డ్యాం నుంచి ఆయకట్టు రైతులకు రెండో పంటకు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చిచెప్పడంలో అర్థం లేదన్నారు. డ్యాంలో రబీ పంటకు తగినంత నీరు ఉందని, గేట్లు మార్చాలనే సాకుతో ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వకపోతే రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని లేని పక్షంలో రైతుల తరఫున తాము ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని రైతుల సమస్యలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రైతుల సమస్యలు రోజురోజుకు జఠిలంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కే.ఎస్ దివాకర్, బీజేపీ ప్రముఖులు రామలింగప్ప, గురులింగనగౌడ, ఐనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులు, ప్రజల సమస్యలు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
టీబీడ్యాం ఆయకట్టుకు రెండో పంటకు నీరు ఇవ్వాలి
లేకుంటే ఎకరాకు
రూ.50 వేల పరిహారం ప్రకటించాలి
కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన బీజేపీ నేతలు


