వేసవిలో విద్యుత్ కోత ఉండదు
హొసపేటె: రాబోయే వేసవిలో విద్యుత్ కోత ఉండదు, నిరంతర 7 గంటల త్రీ ఫేస్ విద్యుత్ సరఫరాకు కట్టుబడి ఉన్నామని ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ తెలిపారు. మంగళవారం ఆయన తాలూకాలోని బైలువద్దిగేరి గ్రామంలో కర్ణాటక విద్యుత్ ప్రసార మండలి ఆధ్వర్యంలో రూ.9.28 కోట్లతో నూతనంగా నిర్మించిన 110/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం, హొసపేటె పట్టణంలోని 110/11 కేవీ, నాగేనహళ్లి 110/11 కేవీ, నరసింహగిరి 66/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడారు. కుసుమ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి, గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా విద్యుత్ సరఫరాను గణనీయంగా మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బును ఉపయోగించి సామాన్యుల కోసం కొన్ని ప్రజానుకూల పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ తుకారాం, ఎమ్మెల్యేలు గవియప్ప, శ్రీనివాస్, లతా మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ చౌర్యాన్ని అరికట్టండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో అక్రమంగా కొక్కాల ద్వారా విద్యుత్ చౌర్యం జరుగుతోందని, చోరీ నియంత్రణ, ట్రాన్స్‌ఫార్మర్లపై నిఘా ఉంచాలని విద్యుత్ శాఖ మంత్రి కె.జె.జార్జ్ జెస్కాం అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం యాదగిరి జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రైతుల పంప్ సెట్లకు, పరిశ్రమల నిర్వహణకు ఎలాంటి అడ్డంకి రాకుండా విద్యుత్ సరఫరాను మెరుగు పరచాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలి పోకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. గంగా కల్యాణ పథకం కింద తవ్విన బోరుబావులకు విద్యుత్ కనెక్షన్లు త్వరగా ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, శాసనసభ సభ్యులు వేణుగోపాల నాయక్, చెన్నారెడ్డి పాటిల్, జెస్కాం అధ్యక్షుడు ప్రవీణ్ పాటిల్, అధికారులు పంకజ్ కుమార్ పాండే, కృష్ణ బాజ్‌పాయ్, లవీష్ ఒడెయర్, ఎస్పీ ధరణేష్‌లున్నారు.
రైతులకు 7 గంటల నిరంతర విద్యుత్
రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి
కేజే.జార్జ్ వెల్లడి


