
ఆపరేషన్ సింధూర్‌తో శత్రువుకు గుణపాఠం
తుమకూరు: ఆపరేషన్ సింధూర్‌తో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశపు సైనిక శక్తి సామర్థ్యాలు ఏమిటో రుజువయ్యాయని మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయశంకర్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. అమాయకులపై గుళ్లవర్షం కురిపించి సృష్టించిన మారణహోమానికి ప్రతీకారంగా ఉగ్రవాదులపై మన సైన్యం జరిపిన దాడి విజయవంతమైందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం దేశపు చారిత్రక గెలుపు అని, మనపై దాడి చేసిన వారికి గుణపాఠం తప్పదనే సందేశాన్ని పంపినట్లయిందన్నారు. దేశ సైన్యపు పరాక్రమానికి స్మరించారు. కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ, ఎమ్మెల్యే బీ.సురేష్‌గౌడ, డీఆర్‌డీఏ మాజీ డైరెక్టర్ డాక్టర్ ప్రహ్లాద్ రామారావు, ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఏఎస్ కిరణ్ కుమార్, సిద్దగంగామఠం సిద్దలింగ స్వామీజీ, సుత్తూరు మఠం శివరాత్రి దేశికేంద్ర స్వామీజీ, ఆదిచుంచనగిరి సంస్థానం డాక్టర్ నిర్మలానందనాథ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.