
బెంగళూరుకు వలసల వరద
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో, అందులోనూ బెంగళూరులో వలసవాసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. వాస్తవానికి తొలినాళ్ల నుంచి కర్ణాటకకు ఎంతో మంది బతుకుదెరువు కోసం వలస వచ్చారు. నేటికీ నిత్యం ఎంతో మంది వస్తున్నారు. గతంలో విద్యావంతులు, వృత్తి నిపుణులు, పెద్ద వ్యాపారులు వస్తే, ఇప్పుడు కూలీల సంఖ్య అధికమైంది. వలస కార్మికుల సంఖ్యకు అంతు ఉండడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వలస కార్మికుల్లో 85 శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని కార్మిక శాఖ చెబుతోంది.
లక్షల సంఖ్యలోనే
రాష్ట్రంలో సుమారు లక్ష మందికి పైగా రిజిస్టర్డ్ అయిన కార్మికులు ఉన్నారు. వారంతా జీవనోపాధి కోసం కర్ణాటకకు వచ్చారు. అసలైన వలస కార్మికుల సంఖ్య గురించి కచ్చితమైన సమాచారం లేదు. అయితే కొంతమంది పారిశ్రామికవేత్తలు, ఇతర సంస్థలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ సంఖ్య కొన్ని లక్షల వరకూ ఉండవచ్చు. కర్ణాటక భవనాలు, ఇతర నిర్మాణాల కార్మిక సంక్షేమ మండలిలో ఇప్పటివరకు నమోదైనది మాత్రం 18,865 మంది మాత్రమే. వీరికి మాత్రమే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు లభిస్తాయి. కానీ ఉత్తరాది వలస కార్మికులకు భాష సమస్య, నిరక్షరాస్యత వల్ల ఈ నమోదు చేసుకోవడం లేదు.
ఈ రాష్ట్రాల నుంచి అధికం
వలస కార్మికుల్లో ఎక్కువగా బిహార్, అసోం, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. బంగ్లాదేశీయులు వేలాది మంది అక్రమంగా మకాం వేసినట్లు ఆరోపణలున్నాయి. కర్ణాటకకు వచ్చే వలస కార్మికుల గమ్యస్థానం బెంగళూరే అవుతోంది. నిత్యం దేశం నలుమూలల నుంచి వచ్చే రైళ్లలో వేలాదిమంది ఉత్తరాది కార్మికులు వస్తుంటారు. ఇక్కడ ఏదో ఒక పని దొరుకుతుందని, మంచి జీవితం లభిస్తుందనే ఆశే వారిని సిలికాన్ సిటీకి రప్పిస్తోంది. మెట్రో నిర్మాణం, పైప్‌లైన్ల తవ్వకాలు, భవనాలు, ఇళ్ల నిర్మాణం, హోటల్ కూలీ పనుల్లో ఎక్కువమంది ఉన్నారు. చవగ్గా కూలీకి వస్తూ తమకు పని లేకుండా చేస్తున్నట్లు స్థానిక పేదలు, కార్మికులు వాపోతున్నారు.
రాష్ట్రంలోనూ అధికంగా
వలస కార్మికులు
ఏటేటా పెరుగుతున్న వైనం
85 శాతం ఉత్తరాది రాష్ట్రాల నుంచే