
అనుమానాలపై ఆధారాలున్నాయి
బనశంకరి: ధర్మస్థలలో అత్యాచారాలు చేసి వందలాది మంది మహిళల శవాలను పూడ్చిపెట్టారనే ఆరోపణల వ్యవహారంలో ప్రతి రోజు సంచలనాలు నమోదవుతున్నాయి. తాను చెప్పినదంతా అబద్ధమని చిన్నయ్య లెంపలు వేసుకోగా, మరో పోరాటదారుడు గిరీష్ మట్టణ్ణవర్ మాత్రం తన వద్ద ఆధారాలున్నాయని ప్రకటించాడు. శనివారం సిట్ అధికారులకు 500 పేజీల ఆధారాలను అందజేశాడు. బెళ్తంగడిలోని సిట్ ఆఫీసుకు వెళ్లి, ధర్మస్థలకు సంబంధించి కొన్ని అసహజ మరణాల గురించి సక్రమంగా విచారణ చేపట్టలేదని, ఇప్పుడైనా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఫిర్యాదు చేశాడు. ధర్మస్థల పోలీసులు అసహజ మరణాల గురించి దర్యాప్తు చేయలేకపోయారన్నాడు. ధర్మస్థల పంచాయతీ రికార్డుల ఫోర్జరీ ఆరోపణల మీద సిట్ విచారణను వేగవంతం చేసింది. పంచాయతీ అధికారులను విచారించింది. ఇక దుష్ప్రచారం కేసులో బళ్లారి యూట్యూబర్ సమీర్ శనివారం కూడా విచారణకు వచ్చాడు.
బెంగళూరుకు చిన్నయ్య
చిన్నయ్య శవాలు పూడ్చిపెట్టడాన్ని చూశానని చెప్పిన జయంత్ అనే వ్యక్తి ఇంటిని సిట్ అధికారులు తనిఖీ చేశారు. బెంగళూరు పీణ్యాలో ఉన్న జయంత్ ఇంటికి చిన్నయ్యతో కలిసి వచ్చి పరిశీలన చేపట్టారు.
వాసంతి బతికే ఉంది
ధర్మస్థలలో అనన్య భట్ అదృశ్యం అనేది కాల్పనిక సృష్టి అని ఆమె తల్లిగా చెప్పుకునే సుజాతభట్ ఒప్పుకున్నారు. అంతేగాక వాసంతి అనే మహిళ ఇంకా బతికే ఉందని సిట్ ముందు తెలిపారు. మృతదేహాలు పూడ్చిపెట్టానని ఫిర్యాదు చేసిన చిన్నయ్య తో కలిసి సుజాతభట్ ను సిట్ అధికారులు తీవ్ర విచారణ చేపట్టారు. సుజాతభట్ చూపించే అనన్య ఫోటో ఎవరిదని అడగ్గా, వాసంతి అనే యువతిదని, ఆమె జీవించే ఉందని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. నదిలో కుళ్లిపోయిన మృతదేహం దొరికితే అది వాసంతిదని గతంలో ప్రచారం సాగింది.
ధర్మస్థల వ్యవహారం..
సిట్‌కు గిరీష్ మట్టణ్ణవర్ 500 పేజీల సమాచారం
బనశంకరి: ధర్మస్థల కేసును సిట్ ఎంతవరకు దర్యాప్తు చేపడుతుందనేది చెప్పలేమని, పూర్తయ్యే వరకు విచారణ కొనసాగుతుందని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరులో ఆయన మాట్లాడారు. సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి శనివారం తనను కలిసి చర్చించారని, ఆ విషయాలను చెప్పలేనని అన్నారు. తొందరగా పూర్తిచేసి నివేదిక అందించాలని తెలిపామన్నారు. ఈ వారంలోనే నివేదిక ఇవ్వండి అని ఆదేశించలేమన్నారు. తవ్వకాల్లో లభించిన అస్థికలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారని, నివేదిక ఎలా ఉంటుందనేది తనకు తెలియదన్నారు. అన్నింటినీ శాసీ్త్రయంగా పరిశీలించి దర్యాప్తును కొనసాగించాలి, త్వరగా చేయండి అని ఒత్తిడి చేయడం సరికాదని అన్నారు.
దర్యాప్తు సమయంలో దొరికే వేర్వేరు సమాచారం మీద కూడా విచారణ
చేపడుతున్నారని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి జోక్యం లేదన్నారు. సౌజన్య తల్లి ఫిర్యాదును సిట్ పరిశీలిస్తుందా? అన్న ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. చిన్నయ్యను బెంగళూరు కు తీసుకువచ్చి విచారిస్తారా?, అతనికి ఆశ్రయం ఇచ్చిన వారిని అరెస్ట్ చేస్తారా అనేది సిట్ ఇష్టమన్నారు. విపక్షాలు చెప్పినట్లు దర్యాప్తునకు గడువు విధించలేమన్నారు. ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేతో పాటు అందరూ సిట్‌ను స్వాగతించారని, ఇలాంటి సమయంలో ఎన్‌ఐఏకు దర్యాప్తు అప్పగించడం అసాధ్యమని చెప్పారు.
క్షుణ్ణంగా సిట్
విచారణ: హోంమంత్రి

అనుమానాలపై ఆధారాలున్నాయి