
అటు వర్షాలు.. ఇటు తెగుళ్లు
ధార్వాడ వద్ద నవలగుందలో నీట మునిగిన పొలాలు
శివాజీనగర: రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా సముద్రాల్లో అల్ప పీడనం, రుతు పవనాల ప్రభావం వల్ల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి, ఫలితంగా పలు జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. మల్నాడు, హావేరి, ధార్వాడ, బళ్లారి, చిక్కబళ్లాపుర జిల్లాల్లో కురిసిన నిరంతర వర్షాలతో పంటలు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. కంది, పెసర, వరి, వేరుశెనగ, మొక్కజొన్న, మిరప, పత్తి, పొద్దు తిరుగుడు తదితర పంటలను ఈ ఖరీఫ్‌లో లక్షల ఎకరాలలో సాగు చేశారు.
బళ్లారి జిల్లాలో మిరప పంటకు తెగుళ్లు మొదలయ్యాయి. చిక్కబళ్లాపురలో బంగాళదుంప పంట సాగుకు వర్షాలు అడ్డు వచ్చాయి. ఆగస్టు ముగుస్తున్నా విత్తనాలు ఆరంభం కాలేదు. రైతులు మార్కెట్‌కు వచ్చి బంగాళాదుంపల విత్తనాలు అడగటం లేదని విత్తన వ్యాపారులు వాపోయారు. ధారవాడ జిల్లా నవలగుందలో భారీ స్థాయిలో ఉల్లిగడ్డల పంట వేశారు, తీవ్ర వర్షాల ధాటికి ఆ పంటలకు రోగాలు వ్యాపిస్తున్నట్లు రైతులు ఆవేదన చెందారు. దీంతోపాటుగా జొన్నలు, పెసర, ఉద్దిబేడల పొలాలు నాశనమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జిల్లాలకు సహాయక బృందాలను పంపి పంట నష్టాన్ని అంచనా వేయాలని, పరిహారాన్ని అందజేయాలని కలబుర్గిలో ఇటీవల రైతులు, రైతు సంఘాలు బృహత్ ఆందోళన నిర్వహించాయి. మొత్తానికి ఈ ఖరీఫ్ వర్షాలు రైతులకు దిగుబడిని దూరం చేశాయి.
రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో అతివృష్టి
కనీసం 2 లక్షల ఎకరాలలో పంటనష్టం
అన్నదాతల కంట కన్నీరు
పరిహారం ఇవ్వాలని మొర

అటు వర్షాలు.. ఇటు తెగుళ్లు