
పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి
శివాజీనగర: రాష్ట్రంలో కుల వ్యవస్థ వల్ల అనేక అణగారిన వర్గాలవారు కుల వివక్షని అనుభవిస్తున్నారు. ఇటువంటి కేసులను తీవ్రంగా పరిగణించి, దాడులను అరికట్టాలని సీఎం సిద్దరామయ్య తెలిపారు. శనివారం రాజభవన్‌లో వివిధ సేవా పతకాలకు ఎంపికై న పోలీసు అధికారులు, సిబ్బందికి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చేతుల మీదుగా మెడల్స్‌ను బహూకరించారు. సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి జిల్లాలో డీసీఆర్‌ఈ పోలీస్ స్టేషన్‌లను స్థాపించాం, కానీ వాటి పనితీరు సంతృప్తికరంగా లేదని గమనించాం. దీనిని అధికారులు తీవ్రంగా పరిగణించి, అణగారిన వర్గాలవారికి అండగా ఉండే ప్రభుత్వ లక్ష్యాన్ని సఫలం చేయాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆత్మవిమర్శ చేసుకొన్న ఉత్తమ సేవలు అందించాలని తెలిపారు.
ఎస్సీ ఎస్టీ కేసుల్లో శిక్షలు పెరగాలి
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో కన్నడనాట శిక్షల స్థాయి చాలా తక్కువగా ఉంది, దీనిపై పోలీసులు దృష్టిసారించాలని సీఎం తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటంతో పాటుగా ప్రజల ఆస్తిపాస్తి కాపాడటం పోలీసుల బాధ్యత అని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలను చేపట్టినట్లయితే చాలావరకు నేరాలను అరికట్టవచ్చని, సమాజంలో శాంతిని నెలకొల్పవచ్చని అన్నారు. అణగారిని వర్గాలపై జరిగే దాడులను అడ్డుకోవాలని, సామాన్య ప్రజలకు న్యాయం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి జీ.పరమేశ్వర్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు మంచి సేవలందించాలి
సీఎం సిద్దరామయ్య