
లంచగొండి అరెస్టు
న్యూస్‌రీల్
శివమొగ్గ: ఇంటికి ఖాతా చేసి ఇచ్చేందుకు లబ్ధిదారు నుంచి రూ.10 వేలు లంచం తీసుకున్న ఆరోపణలపై శివమొగ్గ మహానగర పాలికె ఆశ్రయ విభాగం సముదాయ అధికారి శశిధర్‌ని లోకాయుక్త అధికారులు అరెస్టు చేశారు. వివరాలు.. బొమ్మనకట్టె ఆశ్రయ బడావణెలో ఫిర్యాదుదారుడు మహ్మద్ ఆసిఫుల్లా ఒ ఇంటిని కొన్నాడు. దానిని తన పేరిట ఖాతా చేయించుకునేందుకు పాలికెకు అర్జీ సమర్పించాడు. ఖాతా చేసి ఇచ్చేందుకు రూ.10 వేలు లంచం ఇవ్వాలని ఆశ్రయ విభాగం సముదాయ అధికారి శశిధర్ డిమాండ్ చేశాడు. మహ్మద్ లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం సాయంత్రం నెహ్రూ రోడ్డులోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వాణిజ్య సంకీర్ణంలోని పాలికె ఆశ్రయ కార్యాలయంలో అధికారి శశిధర్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఉండగా లోకాయుక్త పోలీసులు దాడి జరిపి అరెస్టు చేశారు.
టెక్కీకి రూ.24 లక్షల టోపీ
మైసూరు: ప్యాలెస్ సిటీలో సైబర్ మోసాలు ఏమాత్రం తగ్గడం లేదు. షేర్ మార్కెట్‌లో అధిక లాభాలను గడించాలని ఆశపడిన ఓ ఐటీ ఉద్యోగి కేటుగాళ్లను నమ్మి రూ.24.71 లక్షలను కోల్పోయిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. నగరంలోని విజయనగరకు చెందిన వ్యక్తికి వాట్సాప్ ద్వారా దుండగులు షేర్ మార్కెట్ లాభాల గురించి తెలిపి, పెట్టుబడి పెడితే అనతికాలంలోనే ఎక్కువ లాభాలు గడించవచ్చని ఆశ పుట్టించారు. వారి మాటలను నమ్మిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దశల వారీగా రూ.24.71 లక్షలను వంచకులు చెప్పిన ఖాతాకు బదలాయించి మోసపోయాడు. అసలు, లాభం పైసా కూడా రాకపోవడంతో సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.