
వినూత్నం.. పశుపోషణ కేంద్రం
సాక్షి బళ్లారి: సాధారణంగా విద్యార్థులకు, వృద్ధులకు ఉండేందుకు వసతి నిలయాలను చూస్తుంటాం. వసతి నిలయం అంటే అదేదో మనషులు ఉండేందుకు అనుకుంటే పొరపాటు. రాష్ట్రంలోనే అత్యాధునిక టెక్నాలజీతో పశువులు నివాసం ఉండేందుకు అక్కడే వాటికి ఆలనా, పాలనా చేయడంతో పాటు పాడిపరిశ్రమను అభివృద్ధి చేయడానికి వినూత్న తరహాలో ఆవులు, గేదెల వసతి నిలయం ఏర్పాటు చేసి హైటెక్ పద్ధతిలో పాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా ఏకై క వసతి నిలయం ఇది. కర్ణాటకలోని గదగ్ జిల్లా హులకోటి–కుర్తకోటి గ్రామాల మధ్య కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దాదాపు రూ.1.50 కోట్ల వ్యయంతో 120కిపైగా ఆవులు, గేదెలు వసతిగా ఉండేందుకు సరికొత్త రీతిలో వసతి నిలయాన్ని ఏర్పాటు చేశారు. వసతి నిలయంలో పశువులకు చికిత్స, అక్కడ పని చేసే సిబ్బందికి ప్రత్యేక గది, పశువులకు మేతను ఉంచేందుకు ఏర్పాట్లు, సరైన గాలి వచ్చేందుకు చర్యలు, పశువులకు మంచి నీటిని అందించేందుకు కొళాయి, పశువుల పేడను టెక్నాలజీ సాయంతోనే మనుషులు లేకుండా శుభ్రం చేయడానికి ఏర్పాట్లు చేశారు.
హైటెక్ పద్ధతిలో పశుపోషణకు చర్యలు
ఈసందర్భంగా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు అప్పణ్ణ మాట్లాడుతూ గుజరాత్‌లో ఇలాంటి పశువులకు వసతి నిలయాలు ఉండటం చూశామన్నారు. తమ ప్రాంతంలో పాడి రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ మిషన్ పథకం ద్వారా రూ.1.50 కోట్లతో హైటెక్ టెక్నాలజీతో పశువులకు వసతి నిలయం ఏర్పాటు చేశామన్నారు. చాలా మంది పాడి రైతులకు తమ ఇళ్ల వద్ద పశువులను పెంచుకోవడానికి స్థలం కొరత, నిర్వహణ తదితర సమస్యలుంటాయన్నారు. సామూహికంగా పశువులకు వసతి నిలయం ఏర్పాటు చేయడం ద్వారా పేద కుటుంబాలకు చెందిన పాడి రైతులు వసతి నిలయంలో పెంచుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. ప్రారంభంలో మూడు నెలల పాటు ఉచితంగా పశువులను ఉంచి వాటి నిర్వహణ చూసుకొన్నామన్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతోందన్నారు. ఈనేపథ్యంలో సిబ్బందికి జీతాలు, విద్యుత్ చార్జీలు, పశువులకు శుభ్రం చేయడం లాంటి ఖర్చులకు గాను ప్రతి గేదె, ఆవుకు నెలకు రూ.200లు చొప్పున వసూలు చేస్తున్నామన్నారు.
మూగ జంతువులకు
చక్కని ఆలనా పాలన
120కి పైగా ఆవులు, గేదెల
నివాసానికి ఏర్పాట్లు
గదగ్ జిల్లా కుర్తకోటిలో
విభిన్న రీతిలో పశు వసతి నిలయం
రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం
హాస్టల్‌లో విద్యార్థులను ఎలా చూసుకుంటారో అదే తరహాలో పాడి పశువులను సంరక్షణ చేస్తున్నామన్నారు. రైతులు అవగాహన పెంచుకొని షెడ్డులో పాడి పశువులను ఉంచితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందేందుకు వీలవుతుందన్నారు. రైతులే ఇలాంటి షెడ్లను నిర్మించుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. వసతి నిలయంలో పాడి పశువులను సంరక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఆసక్తి గల పాడి రైతులు వసతి నిలయంలో తమ పాడిపశువులను ఉంచవచ్చని తెలిపారు. ప్రస్తుతం వసతి నిలయంలో 25 గేదెలు ఉన్నాయన్నారు. ఆయా రైతులే మేతను సమకూర్చుకుంటున్నారన్నారు. వసతి, ఇతర సౌకర్యాలు, వైద్య సదుపాయం, క్లినిక్ తదితర మౌలిక సదుపాయాలు గ్రామ పంచాయతీ నిర్వహణ చేపడుతుందన్నారు. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసుకొనే రైతులకు మేలు చేయడంతో పాటు గ్రామ పంచాయతీకి కూడా ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే ఏకై క పశు వసతి నిలయం కుర్తకోటిలో ఏర్పాటు చేయడం తమకు గర్వకారణంగా ఉందన్నారు.

వినూత్నం.. పశుపోషణ కేంద్రం

వినూత్నం.. పశుపోషణ కేంద్రం