
కళ్యాణ కర్ణాటకను వీడని వర్షాలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారీగా కురిసిన వానలకు వాగులు, వంతెనలు నీట మునిగాయి. బీదర్ జిల్లా భాల్కిలో పంటలు నీటి పాలయ్యాయి. నెలపాడులో ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి నీరు చేరాయి. బదగల్ గ్రామానికి వెళ్లడానికి వీలు లేకుండా భీమా నది పొంగి ప్రవహిస్తోంది. ఆనందవాడి, కారంజ మధ్య వంతెన వరద నీటిలో మునిగి పోవడంతో చుట్టుపక్కల 16 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, శాసన సభ్యుడు శైలేంద్ర బేల్దాళ్, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మాణిక్ రావ్ పాటిల్ వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ఆలకించారు. నీటిలో మునిగిన పంటలను పరిశీలించారు. పంట నష్టపరిహారం ఎకరాకు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాలకు పాడైన రహదారి మరమ్మతులకు రూ.9 కోట్ల నిధులు వ్యయం చేయనున్నట్లు జిల్లాధికారి తెలిపారు. ఇళ్లలోకి నీరు చేరిన వారి కుటుంబాలకు గంజి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఖండ్రె అధికారులను ఆదేశించారు.
వరద పీడిత ప్రాంతాల్లో నేతల పర్యటన
నీట మునిగిన పంటలు, నష్టం పరిశీలన

కళ్యాణ కర్ణాటకను వీడని వర్షాలు