
ఎగుమతి సుంకాలు తగ్గించాలి
హోసూరు: అమెరికా ఎగుమతి సుంకంపై 25 శాతం అదనపు పన్ను విధించడంతో గార్మెంట్స్ కంపెనీలు తీవ్రంగా నష్టాలు ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఈ విషయంపై చర్చిలు జరిపి పెంచిన సుంకాన్ని తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం కోరారు. శనివారం హోసూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కార్యదర్శి సురేష్‌తో మాట్లాడారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ఆ దేశం 25 శాతం సుంకం పెంచడంతో తమిళనాడులోని తిరుప్పూర్ వంటి ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్న గార్మెంట్స్ సంస్థలు మూతపడే స్థాయికి చేరుకున్నాయన్నారు. కార్మికులకు జీతాలు అందించలేక పోతున్నారని తెలిపారు. టన్నుల కొద్ది ఉత్పత్తి వస్తువులు గిడ్డంగుల్లో మగ్గుతున్నాయన్నారు. వేలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో చొరవ తీసుకుని పెంచిన ఎగుమతి సుంకం తగ్గించాలని సూచించారు. డాక్టర్ల సంఘం అధ్యక్షుడు పెరుమాళ్ బదిలీని వాపసు తీసుకోవాలని కోరారు. హోసూరు సమీపంలో ప్రవహిస్తున్న దక్షిణ పెన్నానదిలో రసాయన వ్యర్థాలు కలవడంతో నీటి కాలుష్యం ఏర్పడిందన్నారు. ఈ విషయంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టి నదిలో రసాయనాలు కలిపే వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హోసూరు యూనియన్ కార్యదర్శి దేవరాజ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు బద్రి, హోసూరు పట్టణ కార్యదర్శి నగేష్ బాబు, జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షుడు తిమ్మారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.