
పాఠశాలల స్థలాల్లో నిర్మాణాలు సరికాదు
కోలారు : బంగారు పేటలో మొరార్జి దేశాయి, అంబేడ్కర్ వసతి పాఠశాలల నిర్మాణం కోసం రిజర్వు చేసిన స్థలంలో కోలారు పాల ఉత్పత్తిదారుల సంస్థ సోలార్ యూనిట్ నిర్మిస్తోందని బంగారుపేటె ఎమ్మెల్యే ఎస్ ఎన్ నారాయణస్వామి ఆరోపించారు. ఆక్రమణలు వెంటనే తొలగించాలని ఉప విభాగ అధికారికి లేఖ రాసినట్లు తెలిపారు. కోలారు తాలూకా హుత్తూరు గ్రామ సర్వే నెంబర్ 103లో 153 ఎకరాల స్థలాన్ని పలు అభివృద్ధి పనులకు రిజర్వు చేశారన్నారు. అయితే కోముల్ సంస్థ ఆక్రమించి భూ పరివర్తన, ప్రభుత్వ పూర్వానుమతి కూడా లేకుండా సోలార్ యూనిట్ నిర్మాణ పనులను చేపడుతోందన్నారు. ఈ విషయాన్ని తాను శాసన సభ సమావేశాలలో కూడా ప్రస్తావించి రెవెన్యూ శాఖా మంత్రి దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. అభివృద్ధి పనుల కోసం రిజర్వు చేసిన స్థలంలో సోలార్ యూనిట్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారన్నారు.