రాష్ట్రంపై వరుణ ప్రతాపం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంపై వరుణ ప్రతాపం

Aug 30 2025 7:46 AM | Updated on Aug 30 2025 7:46 AM

రాష్ట

రాష్ట్రంపై వరుణ ప్రతాపం

శివాజీనగర: రాష్ట్రంలో పలు చోట్ల వరుణుడి ఆర్భాటం కొనసాగుతోంది. ఐదు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. కొడగు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో పాఠశాలలు, అంగన్‌వాడీలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ జిల్లాధికారి వెంకటరాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. బీదర్‌ జిల్లా అంతటా నిత్యం కురుస్తున్న వర్షంతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పాఠశాలలు, కాలేజీలకు జిల్లాధికారి శిల్పాశర్మ సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఉత్తర కన్నడ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో 3 తాలూకాల్లోని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. కుమటా, హొన్నావర, భట్కళ తాలూకాల్లోని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. దక్షిణ కన్నడ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసే విషయమై వాతావరణ శాఖ ముందు సూచన చేసిన నేపథ్యంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలకు సెలవు ప్రకటించారు.

దక్షిణ కన్నడ జిల్లాలో రెడ్‌ అలర్ట్‌..

భారతీయ వాతావరణ శాఖ, బెంగళూరులోని కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల ఉన్నత విచారణా కేంద్రం ఇచ్చిన ముందు సూచన ప్రకారం దక్షిణ కన్నడ జిల్లాలో వర్షం కురిసే వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం ఉండగా, జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. శుక్రవారం దక్షిణ కన్నడ జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, పీయూ కాలేజీలు, ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు దిగరాదని జిల్లా యంత్రాంగం సూచించింది. జిల్లా, తాలూకా స్థాయి అధికారులు కేంద్ర స్థాయిలో ఉండి ప్రకృతి వైపరీత్యాల నిర్వహణను తప్పకుండా నిర్వహించాలి. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి జిల్లాధికారి కార్యాలయ నియంత్రణ కేంద్రంతో నిరంతరం సంప్రదిస్తూ ఉండాలని సూచించారు.

నదీ, సముద్ర తీరాలకు వెళ్లవద్దని ఆదేశాలు..

శివమొగ్గ జిల్లాలోని శివమొగ్గ, సాగర, హొసనగర, సొరబ, శికారిపుర తాలూకాల్లో అంగన్‌వాడీలు, పాఠశాలలు, పీయూ కాలేజీలకు సెలవు ఇచ్చారు. కాగా భద్రావతి, తీర్థహళ్లి తాలూకాల్లో పాఠశాలలు, కాలేజీలకు ఎలాంటి సెలవు ప్రకటించలేదు. వాతావరణ శాఖ ముందు సూచన ప్రకారం ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు, కొడగు, శివమొగ్గ, బెళగావి, బీదర్‌, కల్బుర్గి, యాదగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 1 వరకు వర్షం ముందు సూచనను వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఉత్తర కన్నడ, శివమొగ్గ జిల్లాల్లో ఊహించిన దానికంటే అధిక వర్షం కురుస్తోంది.

తుంగభద్ర పరవళ్లు

హొసపేటె: తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాచ్చింది. దీంతో శుక్రవారం జలాశయంలోకి 75 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరింది. 2 గేట్లను 3 అడుగులు, 3 గేట్లను 2 అడుగులు, 9 గేట్లను 4 అడుగుల మేర పైకెత్తి నదికి 55 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1625.86 అడుగులు, నీటినిల్వ 79.33 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 41,075 క్యూసెక్కులుగా ఉందని మండలి అధికారులు తెలిపారు.

ఐదు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

వర్షంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం

కబిని, తారక డ్యాంలు ఫుల్‌

మైసూరు : కేరళలోని వయనాడులో కుంభవృష్టి వల్ల మైసూరు జిల్లా హెచ్‌డి.కోటె తాలూకాలో ఉన్న కబిని, తారక జలాశయాలకు భారీగా వరద నీరు చేరి నిండుకుండల్లా మారాయి. ముందు జాగ్రత్త చర్యగా నీటిని దిగువకు విడుదల చేశారు. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కబిని జలాశయం నుంచి 15వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు హెబ్బళ గ్రామం వద్ద ఉన్న తారక జలాశయం నుంచి రెండు క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. నది సమీపంలోకి ఎవరూ వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంపై వరుణ ప్రతాపం 1
1/1

రాష్ట్రంపై వరుణ ప్రతాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement