
అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి
శివమొగ్గ : శివమొగ్గ జిల్లా శికారిపుర తాలూకా హొసూరు సమీపంలో చిరుత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక్కడి ఎంపీఎం నడుం తోపులో చిరుత కళేబరం కనిపించడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి మూడేళ్ల వయసున్న మగ చిరుతగా గుర్తించారు. అనంతరం పశువైద్యులతో పోస్టుమార్టం చేయించి ఖననం చేశారు. చిరుత ఎలా మృతి చెందిందనేది నివేదిక అందిన తర్వాత తెలుస్తుందని అటవీశాఖ అధికారి మోహన్‌కుమార్ తెలిపారు.
హలసూరు గురుద్వారాను పేల్చేస్తామని బెదిరింపు
శివాజీనగర: హలసూరు ప్రధాన రోడ్డులో ఉన్న గురుద్వారాను పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ పంపారు. 4 రోజుల క్రితం ‘డీ–బ్రాహ్మినైజ్ ద్రావిడిస్టన్’ అనే సంఘం నుంచి రాజ గిరి అనే వ్యక్తి పేరుతో గురుద్వారాకు ఈ–మెయిల్ అందింది. త్వరలో నాలుగు ఆర్‌డీఎక్స్ ఐఈడీతో గురుద్వారా బాత్‌రూమ్‌లో బాంబు పేలుతుందని ఆ ఈ–మెయిల్‌లో ఉంది. దీంతో ఖుషిపాల్ సింగ్ అనే వ్యక్తి హలసూరు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ– మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీఐ వాహనానికి జరిమానా
యశవంతపుర: నో పార్కింగ్ జోన్‌లో నిలిపిన సీఐ వాహనానికి పోలీసులు జరిమానా విధించారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకాలో జరిగింది. ఎన్‌ఆర్‌పుర సీఐ ఇటీవల నో పార్కింగ్ స్థలంలో తన జీపును నిలిపారు. గమనించిన కొప్ప ట్రాఫిక్ ఎస్‌ఐ బసవరాజ్ ఆ వాహనానికి లాక్ వేసి రూ. 500 జరిమానా విధించారు. జీపు డ్రైవర్ జరిమానా మొత్తం చెల్లించి వాహనాన్ని విడిపించుకొని వెళ్లాడు. చట్టం అందరికీ సమానమని ఎస్‌ఐ బసవరాజ్ నిరూపించారని జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి