మరుగుదొడ్డిలో విద్యార్థిని ప్రసవం
● బాధితురాలు 9వ తరగతి విద్యార్థిని
● యాదగిరి జిల్లాలో ఘటన
రాయచూరు రూరల్: కామాంధుడి దాష్టీకంతో గర్భం ధరించిన పాఠశాల విద్యార్థిని మరుగుదొడ్డిలో ప్రసవించింది. సభ్య సమాజం తలదించుకొనే ఈ ఘటన యాదగిరి జిల్లాలో జరిగింది. శహాపురలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని తరచూ సమీపంలోని కక్కెరలో ఉన్న ఆలయానికి స్వామి దర్శనం కోసం వెళుతుండేది. వివాహితుడైన పూజారి పరణ్ణ ఆ బాలికను మాయమాటలతో లోబరుచుకున్నాడు. గర్భం ధరించిన బాలిక బుధవారం రాత్రి మరుగుదొడ్డికి వెళ్లిన సమయంలో మగబిడ్డకు జన్మ ఇచ్చింది. పాఠశాల సిబ్బంది బాలికను, పసిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. జిల్లాధికారి హర్షల్ బోయర్, ఎస్పీ పృథ్వీ శంకర్, అధికారులు ఆస్పత్రికి వెళ్లి బాలికను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఆలయ పూజారి పరణ్ణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ ఎస్‌ఎం పాటిల్ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం వహించినట్లు ఆరోపణలపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బసమ్మ పాటిల్, సూపర్‌వైజర్ గీత, ఉపాధ్యాయులు నరసింహమూర్తి, శ్రీధర్‌ను సస్పెండ్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న నర్సు కావేరమ్మను విధుల నుంచి తొలగించినట్లు సాంఘీక సంక్షేమ శాఖ అధికారి చెన్నబసప్ప తెలిపారు.
దర్శన్ భార్యకు
అశ్లీల సందేశాలు
యశవంతపుర: నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీశ్‌కు గుర్తు తెలియని వ్యక్తులు అశ్లీల సందేశాలు పంపి వేధించారని నెలమంగలకు చెందిన భాస్కర్ ప్రసాద్ అనే వ్యక్తి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోస్టులు పెట్టిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకొని 15 రోజుల్లో నివేదిక అందించాలని మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. మాజీ ఎంపీ రమ్యకు గతంలో కొందరు అశ్లీల సందేశాలు పంపగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


