
ఊరూ వాడా బొజ్జగణపయ్యల సందడి
బళ్లారి అర్బన్: వినాయక చవితి రోజున బుధవారం కొలువు తీరే బొజ్జగణపయ్య విగ్రహాల ప్రతిష్టాపనకు నగరంలోని ప్రముఖ కూడళ్లతో పాటు ఎన్నో ఏళ్లుగా ఘనంగా నిర్వహించే వినాయక ప్రతిష్టాపన మండళ్ల నిర్వాహకులు గత కొన్ని రోజుల నుంచి మండపాల నిర్మాణ పనుల్లో తలమునకలయ్యారు. చిన్నారులు, యువత ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా రాత్రింబగళ్లు తమ రోజు వారి పనులకు పక్కన పెట్టి ఈ పనుల్లో చురుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా పటేల్ నగర్, ఎంజీ, గణేష్ నగర్, మోతీ వెనుక మేదార వీధి, కౌల్‌బజార్ గణేష్, కొళగల్ రోడ్డు, తాళూరు రోడ్డు, ఎస్పీ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ఎప్పటిలానే భారీగా గణేష్ విగ్రహాలను కొలువు తీర్చేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తానికి మరో 24 గంటల్లో ఆ విఘ్న వినాయకుడు, ఆదిపూజ్యుడు వినాయక విగ్రహాల ప్రతిష్టాపన వేడుకల కళ, సందడి సర్వత్రా కనిపిస్తోంది. ఇక పోలీసులు ఈ వేడుకలు జరిగే 10, 15 రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండి భారీ బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శోభారాణి సారథ్యంలో చేపట్టారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక మండళ్ల నిర్వాహకులకు తగిన సలహా సూచనలు, జాగ్రత్తలు చెప్పి అవగాహన కల్పించారు. డీజే హోరు తదితర శబ్దాల సందడికి పలు నియమాలతో పాటు ముఖ్యంగా పర్యావరణ స్నేహి గణపతులను ప్రతిష్టాపించడం ప్రతి ఒక్కరి విధిగా భావించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.
గణేష్ విగ్రహాల ప్రతిష్టాపనకు
జోరుగా సన్నాహాలు