దొడ్డబళ్లాపురం: కుమార్తె అనన్య భట్ ఏమైందో తెలియదు, ఆమె అస్థికలు ఇవ్వండి అని కొన్నినెలలుగా ధర్మస్థలలో అందరినీ అడుగుతున్న వృద్ధురాలు సుజాత భట్ మీడియాతో మాట్లాడారు. తాను నకిలీ ఫోటోలు ప్రదర్శించడం లేదని, కుమార్తె అస్థికలు ఇవ్వండి అని అడుగుతున్నానన్నారు. అపరిచిత వ్యక్తి చెప్పడంతో తవ్వకాలు చేస్తున్నారు కదా, నా కుమార్తె అస్థికలు దొరికితే ఇవ్వాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. తాను చూపించిన ఫోటోలో ఉన్నది నిజంగా తన కుమార్తె అని, అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, అవి ఎక్కడ ఎవరికి ఇవ్వాలో ఇస్తానన్నారు. తాను బెంగళూరులోని రిప్పన్‌పేటలో ప్రభాకర్‌తో కలిసి జీవించానని, అయితే అతడిని వివాహం చేసుకోలేదన్నారు. కలిసి జీవించరాదని చట్టం లేదుగా అని ప్రశ్నించారు. రిప్పన్ పేట నుంచి కోల్‌కతాకు వెళ్లి వచ్చేదాన్ని, ఎవరికీ తెలీకుండా నా కుమార్తెను పెంచి పెద్ద చేశాను, నా తండ్రి, కుటుంబ సభ్యుల నుంచి ప్రాణభయం ఉండేదని, అందువల్ల అనిల్ భట్ అనే వ్యక్తిని రహస్యంగా వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ఓ రకంగా సుజాతా, అనన్యభట్ కేసు వల్ల కూడా ధర్మస్థల ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. యూట్యూబర్లు ఈ కథనాన్నే ఎక్కువగా వాడుకున్నారు.
నేను అబద్ధాలు చెప్పడం లేదు
వృద్ధురాలు సుజాతా భట్ వినతి
దుష్ప్రచారం బాధాకరం: ధర్మాధికారి హెగ్డే
ధర్మస్థలంలో సిట్ దర్యాప్తును ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే స్వాగతించారు. అపరిచితుని సమాచారం మేరకు పోలీసులు తవ్వకాలు జరపడం గురించి ఆయన మొదటిసారి మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను సీబీఐ దర్యాప్తు సమయంలో కూడా పూర్తిగా సహకరించానన్నారు. ధర్మస్థలం విషయంలో అనవసరంగా దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. సోషల్ మీడియా, టీవీ చానళ్లలో కల్పిత వార్తలు వస్తుండడం బాధపెడుతోందని వాపోయారు. సిట్ పై తనకు విశ్వాసం ఉందని, నిజాలు వెలుగు చూడాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ధర్మస్థలలో తవ్వకాలు నిలిచిపోయాయి. అస్థికలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి నివేదికల కోసం వేచిచూస్తున్నారు.
నా కుమార్తె అస్థికలు ఇవ్వండి