
అల్పపీడనం.. అధిక వర్షం
శివాజీనగర: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మలెనాడు, కరావళి, ఉత్తర కర్ణాటక భాగాల్లో విస్తారంగా వర్షం కురుస్తోంది. వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రోజుల తరబడి వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. చిక్కమగళూరు జిల్లాలో కొండేకాన్ పర్యాటక ప్రాంతంలో భూమి కుంగిపోయి వాహనాలు చిక్కుకొన్నాయి. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఈ జిల్లాల్లో బడులకు సెలవులు
ధారవాడలో వర్షానికి కోర్టు సర్కిల్ బృందావన హోటల్ వద్ద చెట్టు కూలిపోవటంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. బెళగావి జిల్లాలోని బైలహొంగల, కిత్తూరు, ఖానాపుర, సవదత్తి, రామదుర్గ తాలూకాలోని పాఠశాల, కాలేజీలకు సెలవు ఇచ్చారు. ఉడుపి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించి విద్యాలయాలను మూసివేశారు. బెళగావి, కొడగు, ఉత్తర కన్నడ, ధార్వాడ, బీదర్, చిక్కమగళూరులోనూ సెలవులే. మరోవైపు హాసన్‌లో కూడా వర్షం తీవ్రం కావడంతో విద్యాలయాలను మూసివేశారు.
బెళగావిలో జలదిగ్బంధం
ఎడతెగని వానలతో అపారమైన పంట నష్టం జరిగింది. తీర జిల్లాల్లో 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తుండగా, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు తెలిపారు. తీర, మధ్య కర్ణాటకలో మరో రెండు రోజులు కుంభవృష్టి కొనసాగుతుంది. మహారాష్ట్ర నుంచి వరద రావడంతో బెళగావి జిల్లాలో నదులు పోటెత్తాయి. 8 వంతెనలు జలావృతమయ్యాయి. 16 గ్రామాలకు సంబంధాలు కట్ అయ్యాయి. వేదగంగా, దూద్‌గంగా, కృష్ణా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
కావేరి ఉధృతం
మండ్య జిల్లాలో కేఆర్‌ఎస్ ఆనకట్ట నుంచి 91 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన వంతెనలు మునిగే అవకాశముంది. ప్రజలు నదిలోకి దిగరాదని అధికారులు చాటింపు వేశారు. శ్రీరంగపట్టణంలో 221 ఏళ్ల పురాతనమైన బ్రిటిష్ కాలపు వెల్లస్లీ వంతెన మునిగిపోయేలా నది ప్రవహిస్తోంది. వంతెనపై సంచారాన్ని బంద్ చేశారు.
రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కుండపోత
ఉప్పొంగుతున్న కృష్ణా, కావేరి నదులు