పబ్‌లో సీఐ రచ్చ.. సస్పెండ్‌ | - | Sakshi
Sakshi News home page

పబ్‌లో సీఐ రచ్చ.. సస్పెండ్‌

Aug 20 2025 5:26 AM | Updated on Aug 20 2025 5:26 AM

పబ్‌ల

పబ్‌లో సీఐ రచ్చ.. సస్పెండ్‌

మైసూరు: పబ్‌లో మద్యం కై పులో ఆయిల్‌ పోసి గొడవ చేసినందుకు సిసిబి ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్‌ను పోలీస్‌ కమిషనర్‌ సీమా లట్కర్‌ సస్పెండ్‌ చేశారు. చాముండి హిల్స్‌ దిగువన ఉన్న జేసీ నగరలోని ఒక పబ్‌కు వెళ్లిన మోహన్‌కుమార్‌ తాగిన మత్తులో సిబ్బందితో గొడవపడ్డాడు. వారి మీదకు వెళ్తూ, గట్టిగా అసభ్యంగా తిడుతూ హల్‌చల్‌ చేశాడు. నూనె బాటిల్‌ను తీసుకుని ఒలకబోశాడు. ఈ వీడియోలు వైరల్‌ అయ్యాయి. సీఐ అరాచకం అంతటా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద అతనిని కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు.

సైకియాట్రీ పీజీ మెడికో ఆత్మహత్య

దొడ్డబళ్లాపురం: మానసిక వైద్యశాస్త్రంలో పీజీ చేస్తున్న వైద్యురాలు మనోవ్యాధితో ప్రాణాలు తీసుకుంది. హాస్టల్‌లో మెడికల్‌ పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెళగావిలో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన డా.ప్రియా కార్తీక్‌ (27) మృతురాలు. వివరాలు.. ఆమె ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, బిమ్స్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో సైకియాట్రీలో పీజీ కోర్సు చేస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు వార్డుల్లో సేవలందించి, హాస్టల్‌ గదికి చేరుకుంది. రాత్రి 9 గంటల సమయంలో ప్రియ అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. భోజనానికి రాలేదని స్నేహితులు వెళ్లి చూడగా అచేతనంగా పడి ఉంది. ఈమె కొన్ని రోజుల క్రితం కూడా చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిందని, డిప్రెషన్‌తో బాధపడుతూ ఔషధాలను తీసుకుంటోందని బిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ డా.అశోక్‌శెట్టి తెలిపారు. పోలీసులు పరిశీలించి పోస్టుమార్టం కోసం తరలించారు.

కస్టమ్స్‌ పేరుతో దోపిడీ

యశవంతపుర: కస్టమ్‌ అధికారులమంటూ బంగారం వ్యాపారిని బెదిరించి 350 గ్రాముల బంగారాన్ని దోచిన ఐదు మంది దుండగులను మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 13న ఉదయం బంగారం వ్యాపారి భానుదాస్‌ హరిథోరట్‌ మంగళూరు సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని కై రాలి హోటల్‌ వద్ద ఉండగా, కస్టమ్‌ అధికారులమంటూ ఆరుమంది చుట్టుముట్టి తనిఖీ చేశారు. కారులో ఎక్కించుకొని కుమటా తాలూకా శిరసి వద్ద దించేసి రూ.35 లక్షల విలువగల 350 గ్రాముల బంగారాన్ని లాక్కుని పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గాలింపు జరిపి ఐదుమందిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు డీసీపీ మిథున్‌ తెలిపారు.

పాఠశాల ముందు కొట్లాట

చిక్కబళ్లాపురం: తాలూకా పరిదిలోని లింగశెట్టిపురం గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో త్వరలో ఆటల పోటీలు జరపాలని స్వసహాయ సంఘం అద్యక్షురాలు క్రిష్ణవేణి జేసీబీని రప్పించి స్వచ్ఛతా పనులు చేస్తుండగా వివాదం నెలకొంది. జీపీ సభ్యుడు మంజునాథ్‌ వచ్చి నాకు చెప్పకుండా ఎందుకు పనులు చేస్తున్నావు అని ఆమె మీద మండిపడ్డాడు. దీంతో ఇరువర్గాల మధ్య గలాటా జరిగింది. దీంతో క్రిష్ణవేణి అంబేడ్కర్‌ చిత్రపటంతో నిరసన నిర్వహించింది. మరోసారి ఇరువర్గాలు కొట్టుకోవడంతో క్రిష్ణవేణికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

పబ్‌లో సీఐ రచ్చ.. సస్పెండ్‌  1
1/2

పబ్‌లో సీఐ రచ్చ.. సస్పెండ్‌

పబ్‌లో సీఐ రచ్చ.. సస్పెండ్‌  2
2/2

పబ్‌లో సీఐ రచ్చ.. సస్పెండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement